
భత్యం కరవు
● డీఏల ఊసెత్తని కూటమి సర్కార్
● తీరని కలగా 12వ పీఆర్‌సీ ఏర్పాటు
● ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు
రాయవరం: నేను మారిన మనిషిని.. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించను. వారి సంక్షేమం కోసం పాటుపడతాను.. ఈ మాటలను ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటలను పట్టించుకోకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో నిరాశ అలముకుంది. ఒకవైపు నిత్యావసరాల ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తుంటే, ఉద్యోగులకు ప్రకటించాల్సిన కరవు భత్యం (డీఏ) విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు. మరోవైపు ఉద్యోగులకు పీఆర్‌సీ కమిటీ నియామకంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినప్పటికీ కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని వివిధ శాఖల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 11వ పీఆర్‌సీ గడువు 2023 జూలైతో ముగిసింది. గత ప్రభుత్వం 12వ పీఆర్‌సీ చైర్మన్‌గా మన్మోహన్‌సింగ్‌ను నియమించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12వ పీఆర్‌సీని రద్దు చేసింది. ఆ స్థానంలో పే రివిజన్ కమిటీ చైర్మన్‌గా కొత్త వ్యక్తిని నియమించి, పీఆర్‌సీ ప్రతిపాదనలను తయారు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేయక పోవడం, ఐ.ఆర్ ప్రకటించక పోవడం, నాలుగు డీఏల్లో కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించక పోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్‌సీ ఏర్పాటు చేయాలని, ఐ.ఆర్ ప్రకటించాలని, తక్షణమే రెండు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన రేకెత్తుతుంది. అలాగే గతంలో ప్రకటించిన డీఏలకు సంబంధించి అరియర్స్ కూడా చెల్లించాలి. సగటున ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.50 వేలు అనుకున్నా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 60 వేల మంది వరకూ సుమారు రూ.300 కోట్ల వరకూ డీఏ అరియర్ చెల్లించాలి.
డీఏల మాటెత్తని సర్కార్
కేంద్ర ప్రభుత్వం కరవు భత్యం ప్రకటించగానే అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దామాషా పద్ధతిలో ఉద్యోగులకు కరవు భత్యం ప్రకటించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు డీఏలు ప్రకటించి, 2025 జూలై డీఏ ప్రకటించడానికి కేంద్ర క్యాబినెట్ మూడు శాతం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఉద్యోగులకు ప్రకటించలేదు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకూ నాలుగు విడతలు డీఏలను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం 33.67 శాతం డీఏ చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన 2025 జూలై డీఏతో కలిపి 58 శాతం డీఏ చేరుతుంది. ప్రస్తుతం అమలవుతున్న పీఆర్‌సీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక శాతం డీఏ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రకారంగా 12 శాతానికి 10.92 శాతం డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. అలాగే గతంలో మంజూరు చేసిన డీఏల అరియర్స్ కూడా ఇవ్వాలి. 2024 మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం డీఏల ఊసెత్తడం లేదు. 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై డీఏలు ఇవ్వాలి.