
ఎరువుల కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణం
సాక్షి, అమలాపురం: ఎరువుల కోసం రైతులు బారులు తీరే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ రాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు ఎరువుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) విమర్శించారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్ ఆలస్యం కావడంతో పాటు, లక్ష్యం మేరకు సాగలేదన్నారు. అయినా ఎరువులకు కొరత వచ్చిందంటే ప్రభుత్వ వైఫల్యం తేటతెల్లమవుతోందన్నారు.
అధికారులు
అప్రమత్తంగా ఉండాలి
అమలాపురం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐ.పోలవరం, కాట్రేనికోన, మామిడికుదురు, ముమ్మిడివరంల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కొత్తపేట, రామచంద్రపురం మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జేసీ టి.నిషాంతితో పాటు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూం : 08856–2931 04
కొత్తపేట కంట్రోల్ రూం : 8500 238258
రామచంద్రపురం కంట్రోల్ రూం : 08857–245166
పారదర్శకతతో
రీ సర్వే నిర్వహణ
జాయింట్ కలెక్టర్ నిషాంతి
అమలాపురం రూరల్: రీ సర్వేను నిర్దేశిత దశల ప్రకారం పారదర్శకతతో నిర్వహించాలని, భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేని డిజిటల్ రికార్డులను రూపొందించాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి వివిధ జిల్లాల జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జేసీ నిషాంతి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో చేపట్టిన సర్వే ద్వారా రెవెన్యూ రికార్డులను అప్‌డేట్ చేసి, భవిష్యత్తు తరాలకు వివాద రహిత ఆస్తులను అందించాలన్నారు. త్వరితగతిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. రీ సర్వే సిబ్బంది పురోగతి సాధించని పక్షంలో చర్యలు తప్పవన్నారు. డీఆర్వో కె.మాధవి, ఆర్డీవోలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కె.ప్రభాకర్ పాల్గొన్నారు.

ఎరువుల కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణం