
సాక్షి,కోనసీమ: దాదాపు ముప్పైఏళ్ల తర్వాత కలుసుకున్నారు. తమ మనసులోని భావాలను పంచుకున్నారు. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. చిన్నపాటి విందుతో ఆత్మీయ కలయికను కాస్తా ఒక వేడుకగా జరుపుకున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నవారంతా ముప్పైఏళ్ల క్రితం పదోతరగతి బ్యాచ్.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం జడ్పీహెచ్ స్కూలులో 94-95 ఏడాది టెన్త్ పూర్తిచేసారు. అయితే ఇప్పుడు వీరంతా ఒక్కచోట లేరు. కొందరు స్వగ్రామాల్లో ఉండగా, మరికొందరు వృత్తి,వ్యాపారరీత్యా ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ ఉంటున్నారు. అందువల్ల అందుబాటులో ఉన్న మిత్రులందరూ ఇలా కలిసి తమ స్నేహహస్తాన్ని చాటారు. భావితరాలకు ప్రేరణగా నిలిచారు. అయితే ఈ ముప్పైఏళ్ల సుదూర ఎడబాటును దగ్గరచేసేలా, మిత్రులందరినీ ఒక్కగూటికి చేర్చేలా చేసిన ఒకరిద్దరి చిన్నప్రయత్నం పెద్దఫలితాన్ని ఇచ్చింది. మిత్రుల నంబర్లు సేకరించి, వారందరినీ ఐక్యంచేసేలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన వట్టం రామచంద్రశేఖర్, పొదలాడ శ్రీనివాసరావులకు తోటిమిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిలో కలిగిన సంతోషాన్ని చాటుకుంటున్నారు.