
మీ వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడింది
మంత్రి రాసలీలల గురించి చెప్పిన టీడీపీ నేతపై పార్టీ క్రమశిక్షణ సంఘం ఆగ్రహం
ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిక
సాక్షి, అమరావతి: మంత్రి రాసలీలల గురించి బహిరంగంగా చెప్పిన టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి.సుధాకర్‌రెడ్డిపై పార్టీ క్రమశిక్షణ సంఘం విరుచుకుపడినట్లు తెలిసింది. మంగళవారం సుధాకర్‌రెడ్డిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పిలిపించిన క్రమశిక్షణ సంఘం నాయకులు వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ, పంచుమర్తి అనూరాధ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా.. ‘మీరు మాట్లాడిన నిజాలు తీసుకొచ్చే నష్టం ఎంతో తెలుసా? ఏవైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రత్యర్థులకు రాజకీయ అస్రాలు ఇచ్చేలా మాట్లాడటం కరెక్ట్ కాదు’ అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఇటీవల టీడీపీ అనుకూల చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర మంత్రి ఒకరు తిరుపతికి వచ్చిన సమయంలో స్టార్ హోటళ్లలో రాసలీలల్లో మునిగితేలతారని ఆయన చెప్పారు. మంత్రికి తమ లాంటి పార్టీ కార్యకర్తలను కలవడానికి సమయం లేదని, రాసలీలలకే సమయం సరిపోతోందంటూ.. తిరుపతిలో మంత్రి చేసే అసాంఘిక కార్యకలాపాలను వివరించారు.
మండల అధ్యక్ష, ఇతర పార్టీ పదవుల్ని సైతం టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది సోషల్ మీడియా, మీడియాలో విస్తృతంగా ప్రచారమవడంతో ఉలిక్కిపడిన టీడీపీ అధిష్టానం రాసలీలల మంత్రిని ప్రశ్నించకుండా ఆ విషయాన్ని బయటపెట్టిన నేత సుధాకర్‌రెడ్డిని టార్గెట్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రికి చంద్రబాబు వత్తాసు పలుకుతుండటంతో.. ఆ మంత్రి కూడా సుధాకర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే క్రమశిక్షణ సంఘం నేతలు సుధాకర్‌రెడ్డిని పిలిపించుకుని వివరణ కోరారు. తాను చెప్పినవన్నీ వాస్తవాలేనని, మంత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవకుండా వేరే వ్యవహారాలు నడుపుతున్నారని సుధాకర్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది.
‘మీరు మాట్లాడినవి నిజమే అయి ఉండవచ్చు. నిజాలన్నీ బయట మాట్లాడకూడదు. ప్రతిపక్ష పార్టీ వారికి అ్రస్తాలను అందిస్తారా?. అంతర్గతంగా ముఖ్య నాయకుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు’ అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న పనులపై అసహ్యం కలిగి, పారీ్టకి నష్టం జరుగుతోందనే ఆవేశంలో కొన్ని విషయాలు బయటపెట్టానని సుధాకర్‌రెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన్ని క్రమశిక్షణ సంఘం నేతలు హెచ్చరించి పంపినట్లు తెలిసింది. అయితే సుధాకర్‌రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని సదరు మంత్రి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.