
నెమ్మదించి నది
ఫ శాంతిస్తున్న వరద గోదావరి
ఫ లంకల్లో ఇంకా జలదిగ్బంధనం
ఫ ఇప్పటికీ పడవలపైనే ప్రయాణం
ఫ ఆదివారం నుంచి వీడనున్న ముంపు
సాక్షి, అమలాపురం: లంక.. వంక చూస్తే క్ఙన్నీట్ఙి వ్యథలే.. ఇళ్లు, దారుల్లో ఇంకా ముంపు తిప్పలే.. చుట్టూ వరద నీరు చేరడంతో అన్నీ కష్టాలే.. రెండు రోజులుగా జిల్లాలో లంక వాసులను హడలెత్తించిన వరద గోదావరి శాంతిస్తున్నా దిగువన లంక గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. రహదారులు, కాజ్‌వేలు ఇంకా నీటిలోనే ఉండడంతో స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం నుంచి తగ్గుతున్న గోదావరి వరద ఉధృతి శనివారం ఇంకా నెమ్మదించింది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి బ్యారేజీ నుంచి 12,34,933 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇది సాయంత్రం 7 గంటల సమయానికి ===== క్యూసెక్కులకు తగ్గింది. తెల్లవారు జామున రెండు గంటల సమయానికి బ్యారేజీ వద్ద పాండ్ లెవెల్ 13.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అమావాస్య కారణంగా సముద్రంలోకి వేగంగా నీరు దిగడం లేదని లంక వాసులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం సమయానికి లంకలను వరద పూర్తిగా వీడనుంది.
ఇంకా పడవలపైనే..
పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక, ఊడుమూడిలంక, పశ్చిమగోదావరి జిల్లా కనకాయిలంక, మనేపల్లి శివారు శివాయలంకకు స్థానికులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్‌వే ముంపు నుంచి బయట పడుతోంది. ఇంకా రాకపోకలు మొదలు కాలేదు. పడవలపైనే స్థానికులను దాటిస్తున్నారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే ఇంకా ముంపులోనే ఉంది. బి.దొడ్డవరం, అప్పనపల్లి, పెదపట్నంలక వాసులు మామిడికుదురు కొర్లగుంట, అప్పనపల్లి ఉచ్చులవారిపేట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీ ముంపులో ఉంది. ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాన్నేల్లంక, గురజాపులంక, కూనాలంక, కాట్రేనికోన మండలం నడవపల్లి, పల్లంకుర్రు రేవు, అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లెపాలెం, సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, రామరాజులంక బాడవల వద్ద రోడ్లు, ఇళ్లు ముంపులోనే ఉన్నాయి.
పంట.. ముంపునీట
గోదావరి వరదకు కూరగాయ పంటలు, కొబ్బరితోపాటు అంతర పంటలు అరటి, పోక, కోకో తోటలు నీట మునిగాయి. ఉద్యాన పంటలకు పెద్దగా న ష్టం లేకున్నా కూరగాయ పంటలు ఎక్కువగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పి.గన్నవరం మండలంలో నష్టం ఎక్కువగా ఉంది. ఇక్కడ గోదావరి మధ్య లంకలతోపాటు ఏటిగట్లను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కూరగాయ పంటలు అధికంగా వేశారు. దీంతోపాటు సఖినేటిపల్లి, అయినవిల్లి, మలికిపురం, ముమ్మిడివరం మండలాల్లో కూడా కూరగాయ పంటలకు నష్టం అధికంగా ఉంది. సుమారు 300 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని అంచనా. బెండ, టమాటా, వంగతోపాటు తీగ పాదులకు అధికంగా నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. వీటితోపాటు పువ్వులు, బొప్పాయి పంటలకు ఇబ్బంది వచ్చినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చుట్టూ నీరు.. వదలని తీరు
ఎగువన వరద తగ్గుతున్నప్పటికీ కోనసీమలోని పలు లంక గ్రామాల్లో ముప్పు ఇంకా కొనసాగుతూనే ఉంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, సఖినేటిపల్లి, ముమ్మిడివరం మండలాల్లో పలు లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, ముఖ్యంగా పూరి గుడిసెలు నీట నానుతున్నాయి. ఏటిగట్లపై నుంచి లంక గ్రామాలకు రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు ముంపులో కొనసాగుతున్నాయి. మూడు, నాలుగు అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహించడంతో స్థానికులు పడవలు, ట్రాక్టర్లపై రాకపోకలు సాగిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు పడవలపై రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.