
29న జాతీయ శతాధిక కవి సమ్మేళనం
అమలాపురం టౌన్: వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న అల్లవరంలోని శ్రీరవితేజ కళాశాలలో జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు శ్రీశ్రీ కళావేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు, అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు తెలిపారు. అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో ఆ కళావేదిక జిల్లా శాఖ, కోనసీమ రచయితల సంఘం, నానీల వేదిక సంయుక్త పర్యవేక్షణలో ఈ సమ్మేళనం జరుగుతుందని నానిరాజు వెల్లడించారు. స్థానిక కూచిమంచి అగ్రహారంలోని సాయి సంజీవని ఆస్పత్రి ఆడిటోరియంలో జాతీయ శతధిక కవి సమ్మేళనం బ్రోచర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. కవులు, సాహితీవేత్తలు, రచయితలు, కళాకారులు పాల్గొని తెలుగు భాషా వెలుగులను నలుదిక్కులా విస్తరింపజేయడంలో భాగస్వామ్యులు కావాలని నానిరాజు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘ అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, కార్యదర్శి కడలి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి వైఆర్‌కే నాగేశ్వరరావు, పసలపూడి సతీష్ పాల్గొన్నారు.