
పల్లెల్లో పరిశుభ్రతకు పెద్దపీట
అమలాపురం రూరల్: స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. శనివారం అమలాపురం మండలం కామనగరువు, పేరూరు, చింతాడగరువు, రోళ్లపాలెం గ్రామాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే ఆనందరావు పరిశీలించారు. అమలాపురానికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిపాదించిన స్థలాన్ని చూశారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న తరగతి గదుల్లో డిగ్రీ కళాశాల ప్రారంభించి దశల వారీగా భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చారు. చిందాడగరువు– రోళ్లపాలెం స్వర్ణదుర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఎరువుల విక్రయాలపై స్థానిక రైతుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ మహేష్ కుమార్, డీఆర్వో మాధవి తనిఖీలు నిర్వహించారు. ఈపాస్ మెషీన్ సక్రమంగా పనిచేయక పోవడంతో ఎరువుల నిల్వల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. కామనగరువులో వస్తు మార్పిడి విధానంలో ప్లాస్టిక్‌కు బదులు నిత్యావసరాలు సరఫరా చేసేలా ప్రవేశపెట్టిన స్వర్ణ రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు.