
పింఛన్లు తొలగించడం దారుణం
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
మలికిపురం: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల దివ్యాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శనివారం మలికిపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా ఉండగా రాష్ట్రంలో 66 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు అందిస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 61 లక్షలకు కుదించిందన్నారు. దీంతో దివ్యాంగులు రోడ్డు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానం ఉంటే వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేయాలే తప్ప, దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాని ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాల్లో కోత విధించడం దారుణమన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు అందించిన ఘనత మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. పాలన పరంగా ఏమీ చేయలేక జగన్‌ను, వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం ఇదేనని గొల్లపల్లి అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్నరాజా, నాయకులు పాటి శివకుమార్, గుర్రం జాషువా, కుసుమ చంద్రశేఖర్, తాడి సహదేవ్, అడబాల జానకిరామ్, పిప్పర రాజు, చింతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.