
ఎయిడ్స్‌పై యువతకు అవగాహన అవసరం
అమలాపురం టౌన్: ఎయిడ్, హెచ్‌ఐవీపై యువత అవగాహన కలిగి ఉండడంతో పాటు వారంతా ఎయిడ్స్ రహిత సమాజాన్ని ఆవిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సీహెచ్ భరతలక్ష్మి అన్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే వ్యాధుల నిర్మూలనపై జిల్లా స్థాయి క్విజ్ పోటీలను శుక్రవారం అమలాపురంలోని మిరియాం కళాశాలలో జిల్లాలోని జూనియర్ కళాశాలల విద్యార్థులకు నిర్వహించారు. అనంతరం విజేతలకు నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో డాక్టర్ భరతలక్ష్మి మాట్లాడారు. ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు బి.యోగా శ్రీవల్లీ, వి.సంధ్య మొదటి స్థానంలో, ముమ్మిడివరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇ.కనక మహాలక్ష్మి, జి.శాంతి ద్వితీయ స్థానంలో, రాజోలు శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు బీఎస్‌ఎన్ సౌమ్య, ఎస్.అలేఖ్య తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి రూ.5 వేలు, రూ.4 వేలు, రూ.3 వేల చొప్పున బహుమతులు అందించారు. ఈ విజేతలను త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామని డాక్టర్ భరతలక్ష్మి తెలిపారు. ఎయిడ్స్, లెప్రసీ, టీబీ ప్రోగ్రామ్ అధికారి పి.బాలాజీ, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎ.బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా మానటరింగ్, డేటా ఆఫీసర్ వి.రత్నంరాజు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎయిడ్స్ నియంత్రణ కౌన్సిలర్ జి.కవిత, మిరియాం కళాశాల ప్రిన్పిపాల్ నల్లా తమ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.