
ఆక్వా రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి
అమలాపురం టౌన్: ఆక్వా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకుడు కె.సత్తిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసుకున్న వ్యవసాయ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలన్నారు. స్థానిక గొల్లగూడెంలోని జిల్లా ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ట్రంప్ విధిస్తున్న పన్నులతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో 8.4 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని, భారత్ నుంచి ఇతర దేశాలకు 7.16 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఆక్వా ఎగుమతులపై సుంకాన్ని 50 శాతానికి పెంచడం అన్యాయమన్నారు. ఆక్వా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో అమెరికా చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయించేందుకు చంద్రబాబు స్పందించాలన్నారు. దీనిపై రైతు, కౌలు రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు పాల్గొన్నారు.