
లంకగ్రామాలను చుట్టుముట్టిన నీరు
పలుచోట్ల పడవల మీదనే రాకపోకలు
సాక్షి, అమలాపురం: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదనీరు చొచ్చుకురావడంతో లంకవాసుల కష్టాలు రెట్టింపయ్యాయి. భద్రాచలం, ధవళేళ్వరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం నుంచి వరద తగ్గుతుండగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద ముంపు పెరుగుతోంది. వరద లంకగ్రామాలను చుట్టుముట్టింది. రోడ్లు, కాజ్‌వేలు మునగడంతో పలుచోట్ల పడవల మీదే రాకపోకలు సాగుతున్నాయి.
పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లోని పలు లంకగ్రామాల్లోకి వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని మత్స్యకారుల ఇళ్లు నీటమునిగాయి. విద్యార్థులు పడవల మీద పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది.
ప్రజలు నిత్యావసర సరుకులకు, తాగునీటికి అవస్థలు పడుతున్నారు. పంటలన్నీ మునిగిపోయాయి. కూరగాయ పంటలు, బొప్పాయి, ఎర్ర చక్రకేళి, కంద వంటి వాణిజ్యపంటలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్‌వేలు నీటమునిగాయి.

పునరావాస కేంద్రం లేదు
అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార కాలనీలో 80 ఇళ్లు నీట మునిగినా అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు. వరద బాధితులకు భోజనం, నీళ్లు అందించడం లేదు. గోదావరి ఉగ్రరూపం దాలుస్తుందని కోనసీమ జిల్లా లంకవాసులు ఆందోళన చెందుతున్న సమయంలో ఎగువన శాంతిస్తుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండోప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో వారు ఆందోళనలో ఉన్నారు.