
గాజుల గౌరీదేవిగా సుబ్బాలమ్మ
అమలాపురం టౌన్: అమలాపురంలో కొలువైన సుబ్బాలమ్మ అమ్మవారు శుక్రవారం గాజుల గౌరీదేవిగా దర్శనమిచ్చారు. సుమారు 45 వేల గాజులతో అమ్మవారిని అందంగా అలంకరించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవదాయశాఖ ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో దాదాపు 600 మంది మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. కార్యక్రమాన్ని ఈవో ఆర్.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. వ్రతాలు ఆచరించే మహిళలకు వరలక్ష్మి రూపు, పూజా సామగ్రిని దేవస్థానం సమకూర్చింది. దేవస్థానం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి గాజుల అలంకరణకు భక్తులు గాజులు సమర్పించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పెద్దిరెడ్డి సాయి పుల్లయ్య నాయడు, యర్రంశెట్టి మూర్తి, అరిగెల బాబ్జీ, నిమ్మకాయల నాయుడు తదితరుల ఆధ్వర్యంలో అలంకరణ జరిగింది. దేవస్థానంధర్మకర్తల మండలి చైర్మన్ అప్పన వీరన్న, ధర్మకర్తలు పాల్గొన్నారు.