
త్రివర్ణ శోభితం.. కుండలేశ్వరం..
కాట్రేనికోన: కుండలేశ్వరంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత కుండలేశ్వరుని ఆలయంలో స్వామివారిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక రంగులతో అలంకరించారు. ఆలయ అర్చకుడు కాళ్లకూరి కామేశ్వరశర్శ ఆధ్వర్యంలో పూలు, తులసిమాలతో సుందరంగా ముస్తాబు చేశారు. జాతీయ పతాకాన్ని స్వామిపై భాగంలో ఉంచారు.
పేద కాపు విద్యార్థులకు
స్కాలర్ షిప్‌లు
అమలాపురం టౌన్: కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కాత్వా) ఆధ్వర్యంలో తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్రప్రభు సహకారంతో జిల్లాలో ప్రతిభ గల కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను వచ్చే సెప్టెంబర్ మొదటి వారంలో పంపిణీ చేస్తామని కాత్వా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కం మైనర్‌బాబు ప్రకటించారు. స్థానిక కల్వకొలను వీధిలో శుక్రవారం జరిగిన కాత్వా జిల్లా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాత్వా జిల్లా అధ్యక్షుడు మేడచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ గల పేద కాపు విద్యార్థులను గుర్తించాలని, ఆయా నియోజకవర్గాల బాధ్యులకు సూచించారు. ఈ నెల 20వ తేదీ నాటికి విద్యార్థులతో దరఖాస్తులు చేయించాలన్నారు. కాత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి నందెపు శ్రీనివాస్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించారు. కాత్వా నాయకుడు నూకల గురుప్రసాద్ మాట్లాడుతూ వివరాలకు 98494 41988, 94923 87501 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
బడుగు వర్గాలపై
‘కూటమి’ కక్ష సాధింపు
ముమ్మిడివరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బడుగు వర్గాలపై కక్ష సాధింపు చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను తొలగించారని, వాటిలో వితంతువులు కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పింఛను కూడా ఇవ్వకుండానే ఉన్నవాటిని తొలగించడం దారుణమన్నారు. విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలతో అర్హులకు తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేసిందని అన్నారు. తొలగించిన పింఛన్లు తక్షణం పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ప్రజా వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందన్నారు.
ఉచిత బస్సు
ప్రయాణం ఒక వరం
అమలాపురం రూరల్: సీ్త్రశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఓ వరం లాంటిదని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ పథకాన్ని అమలాపురం ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే ఆనందరావుతో కలసి కలెక్టర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మహిళలకు సీ్త్రశక్తి వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి, డీఆర్వో కొత్త మాధవి, జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవకుమార్, నాయకులు మెట్ల రమణబాబు, నల్లా పవన్‌కుమార్ పాల్గొన్నారు.

త్రివర్ణ శోభితం.. కుండలేశ్వరం..

త్రివర్ణ శోభితం.. కుండలేశ్వరం..