
స్త్రీ శక్తి పథకంపై ఆటో కార్మికుల నిరసన
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకాన్ని, మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాలను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో అమలాపురంలో పలుచోట్ల శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. ఈ పథకంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతారని సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం ఈదరపల్లి వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్, కలశం, హైస్కూల్ సెంటర్ల వద్ద ఆయా ఆటో యూనియన్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు మాట్లాడుతూ కూటమి పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో సమయంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ, ఆటో డ్రైవర్ల జీవన విధానానికి ఏ విధమైన భంగం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ఆటోడ్రైవర్ల కష్ట నష్టాలను పట్టించుకోకుండా స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి తమ బతుకులను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులతో కలసి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని సత్తిరాజు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మాట తప్పిన తీరుపై ఆందోళన చేస్తామని జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్ అన్నారు. జిల్లా ఆటో వాలా యూనియన్ వ్యవస్థాపకుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర కార్మిక మంత్రి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్న 10 డిమాండ్లతో పాటు ఆటో సంక్షేమ బోర్డులు తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.