
అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: సంకట హర చతుర్థి సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో విశేషపూజలు, అభిషేకాలు జరిపారు. స్వామిని మాడ వీధుల్లో ఊరేగించారు. కోలాటం నిర్వహించారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో ముగ్గురు, లఘున్యాస అభిషేకాల్లో 109 మంది, గరికపూజలో ఒక జంట, ఉండ్రాళ్ల పూజలో తొమ్మిది మంది, శ్రీలక్ష్మీగణపతిహోమంలో 51 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 8 మందికి అక్షరభ్యాసాలు నిర్వహించారు. 2,500 మంది భక్తులు స్వామి అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి మొత్తం రూ.2,58,178 ఆదాయం లభించిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
డీఎస్సీ ఉచిత శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
అమలాపురం రూరల్: జిల్లా పరిధిలో ఎస్సీ, ఏస్టీ, ఈబీసీ కులాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత ఆన్‌లైన్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమసాధికారత అధికారి పి.సత్యరమేష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అమలాపురంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అభ్యర్థులు టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలన్నారు. వివవరాలకు 70934 01225, 94404 03629 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.