
ఇంత అలక్ష్యమా..
● ధాన్యం.. ధైన్యం
సాక్షి,అమలాపురం/ అయినవిల్లి: సాధారణంగా వరి పంటను సాగుచేసే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి, ఎరువుల కొరత, తెగుళ్లు తదితర సమస్యలు రైతులు ఎదుర్కొంటారు. కానీ కూటమి ప్రభుత్వంలో వారికి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయినా పాలకులు స్పందించక పోవడంతో రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రైతుల సంక్షేమానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తే.. నేటి కూటమి ప్రభుత్వం వారిన్ని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది.
కొనుగోలుకూ లక్ష్యం..
రబీ ధాన్యం కొనుగోలు చేయమంటే తమ లక్ష్యం పూర్తయ్యిందని ఆర్‌బీకే సిబ్బంది చెప్పడంపై అయినవిల్లి మండలం రైతులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడు చేసిన ట్రాక్టర్లతో నేరుగా ముక్తేశ్వరం సెంటరుకు చేరుకుని ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతి వారం క్రమం తప్పకుండా తమ వద్ద ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లా నలుమూలలలో ఏదో ఒక చోట రైతులు రోడ్డున పడి ధర్నా చేయడం పరిపాటుగా మారింది.
రైతుల ఆందోళన
రబీ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం ముగిసిందని ధాన్యం కొనుగోళ్లను నిలిపేయడంపై మండలానికి చెందిన రైతులు, రైతు సంఘం నాయకులు గురువారం ముక్తేశ్వరం సెంటర్‌లో ఆందోళనకు దిగారు.
ఇరవై ధాన్యం లోడు ట్రాక్టర్లలతో ముక్తేశ్వరం సెంటర్‌కు చేరుకుని, నలువైపులా ట్రాఫిక్ నిలిపివేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఒకవైపు ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోతున్నామని, మరో పక్క ప్రభుత్వ కేంద్రాల వద్ద లక్ష్యం పూర్తయిందని కొనడం లేదని ఆరోపించారు.
కూటమి మోసం
ధాన్యం కొనుగోలును అర్థాంతరంగా నిలిపి వేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక పక్కాగా ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేలు అందించలేదన్నారు. తాము పండించిన ధాన్యాన్ని టార్గెట్ పేరుతో కొనుగోలు చేయడం లేదన్నారు. ఇటువంటి ప్రభుత్వం ఆధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సిందేనన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి రాష్ట్ర ప్రజలను ఆర్థిక మాధ్యంలోకి నెట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతారన్నారు.
జగన్ హయాంలో పూర్తి భరోసా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు రైతు భరోసా అందించి ఆదుకున్నారన్నారు. పండించిన పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి మద్దతు ధరను అందించారని, దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపారన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యాన్ని టార్గెట్‌తో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో రైతు సంఘ నాయకులతో అయినవిల్లి ఎౖస్సై పి. శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది చర్చించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చూడాలని కోరడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం ధాన్యం లోడు ట్రాక్టర్లతో అమలాపురంలోని కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు.
కలెక్టరేట్ ముట్టడి
ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధాన్యం ట్రాక్టర్లతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. తమ వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డీఆర్వోతో రైతులు చర్చలు జరిపారు. వారి వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. రైతుల ఆందోళనకు వైఎస్పార్ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అయినవిల్లి మండల అధ్యక్షుడు కుడుపూడి విద్యాసాగర్, నేదునూరు సర్పంచ్ గుమ్మడి ప్రసాద్, నాయకులు మిండగుదిటి రాంబాబు, కుసుమ సునీల్ కుమార్, బొంతు శ్రీను, కోనే చంద్రశేఖర్, చేట్ల రామారావు, కమిడి వెంకటేశ్వరరావు, కుసుమ వెంకటరమణ, మేకా బుచ్చిరామకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు.
40 శాతం ధాన్యం కొంటే ఎలా?
మేము పండించిన ధాన్యంలో 40 శాతం మాత్రమే ప్రభుత్వం కొంటే ఎలా?, మిగిలిన ధాన్యాన్ని మిల్లర్లు ధరలు తగ్గించి కొంటామంటున్నారు. దీనివల్ల నష్టపోతున్నాం. లక్ష్యం అయిపోయిందని నాలుగు రోజులుగా అధికారులు చెబుతున్నారు. గత్యంతరం లేక కలెక్టరేట్ వద్దకు రావాల్సి వచ్చింది.
– గండుబోగుల సత్యనారాయణ మూర్తి,
నల్లచెరువు, అయినవిల్లి మండలం
రైతుల ఇబ్బందులు
రబీలో పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయలేమని తెగేసి చెబుతున్నారు. రైతుకు దిక్కుతోచడం లేదు. రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నిలుస్తోంది.
– గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ
పి.గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్
లక్ష్యం పూర్తయ్యిందని
ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం
రోడ్డెక్కిన రైతులు
ట్రాక్టర్లతో కలెక్టరేట్ ముట్టడి
ముందుగా ముక్తేశ్వరంలో ఆందోళన

ఇంత అలక్ష్యమా..

ఇంత అలక్ష్యమా..

ఇంత అలక్ష్యమా..