
చెత్త గుట్టలు.. స్వచ్ఛ గొప్పలు
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ... ఆచరణలో లేదనడానికి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమమే ఉదాహరణగా నిలుస్తోంది. రోజువారీ పారిశుధ్య నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేక మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఇబ్బంది పడుతుంటే.. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మారుస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అదనంగా నయా పైసా కూడా విడుదల చేయకుండానే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం హోరెత్తిస్తోంది.
జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీ ఉన్నాయి. వీటితో పాటు 22 మండలాల పరిధిలో 345 పంచాయతీలున్నాయి. వీటిలో మూడో వంతు మేజర్‌వి. రావులపాలెం, కొత్తపేట, రాజోలు, మలికిపురం, అంబాజీపేట, ముక్తేశ్వరం, మురమళ్ల, ద్రాక్షారామ గ్రామాలు పేరుకు పంచాయతీలే అయినప్పటికీ నగర పంచాయతీలకు ఏమాత్రం తీసిపోవు. గడచిన ఐదేళ్ల కాలంలో ఆయా ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాలు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వస్తున్న చెత్త రెట్టింపైంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 100 టన్నులకు పైగా చెత్త, ఇతర వ్యర్థాలను మున్సిపల్, పంచాయతీ పారిశుధ్య సిబ్బంది సేకరించాల్సి ఉంది. అయితే, దీనికి అవసరమైన సిబ్బందిలో సగం మంది కూడా లేరు. వస్తున్న చెత్తలో 60 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే కావడంతో దీనిని ఏం చేయాలో పారిశుధ్య సిబ్బందికి తెలియడం లేదు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పంట కాలువలు, మురుగునీటి కాలువల ప్రవాహాలకు సైతం అడ్డంకిగా మారుతున్నాయి. రోజువారీ పారిశుధ్య నిర్వహణ మున్సిపాలిటీలకు, పంచాయతీలకు భారంగా మారుతోంది.
పైసా విదల్చని సర్కారు
పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్య నిర్వహణకంటూ ప్రభుత్వం అదనంగా నిధులు ఇవ్వడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన కూడా లేదు. డంపింగ్ యార్డులకు అవసరమైన భూమి సేకరించడం, చెత్త నుంచి సంపద తయారీ, చెత్త తరలింపునకు అధునాతన వాహనాలు, అవసరమైన పారిశుధ్య సిబ్బంది నియామకం, పారిశుధ్య చర్యలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వంటి బాధ్యతలన్నింటినీ ప్రభుత్వం విస్మరిస్తోంది. వీటికి నయా పైసా కూడా విడుదల చేయకుండానే.. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసి, జోరుగా ప్రచారం చేస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నూతన వాహనాలు సమకూర్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ వాహనాలు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. వీటి మరమ్మతులకు నిధులు కూడా ఇవ్వడం లేదు. క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్)లో భాగంగా నియమించిన ఉద్యోగులకు జీతాలు కూడా సవ్యంగా ఇవ్వడం లేదు. ఈ ప్రభావం చెత్త సేకరణపై పడింది.
● అమలాపురం మున్సిపాలిటీలో చెత్త సేకరణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాహనాలు అందజేసింది. క్లాప్ పరిధిలోని ఉద్యోగులు దగ్గరుండి చెత్త సేకరణ చేయించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీరికి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ఇప్పుడు చెత్త సేకరణలో సిబ్బంది ఉత్సాహంగా పని చేయడం లేదు. పట్టణంలో సేకరిస్తున్న చెత్తకు డంపింగ్ యార్డు చాలడం లేదు. దీంతో ఈదరపల్లి – నల్ల వంతెన మధ్య బైపాస్ రోడ్డును ఆనుకుని చెత్త వేస్తున్నారు. పక్కనే ఉన్న బండారులంక మేజర్ పంచాయతీకి అసలు డంపింగ్ యార్డే లేకుండా పోవడంతో ప్రధాన రోడ్లు, ఇళ్ల వద్దనే చెత్తను ఉంచి తగులబెట్టాల్సి వస్తోంది.
● రావులపాలెం మండలం రావులపాడులో ఆర్‌అండ్‌బీ రోడ్డు, అమలాపురం పంట కాలువ మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. దీంతో, అందులోని చెత్తంతా పంట కాలువలోకి వెళ్లి, నీరు కలుషితమవుతోంది.
● కాట్రేనికోన, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాల్లోని తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో పారిశుధ్య చర్యల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచింది. ఇటీవల కాట్రేనికోన మండలం పల్లంలో హెపటైటిస్–బీ వ్యాధి ప్రబలడానికి అపరిశుభ్రత కూడా ఒక కారణం.
సంపద సృష్టించని కేంద్రాలు
గ్రామ పంచాయతీల్లో ఒకవైపు కొండలా పేరుకుపోతున్న చెత్తను తగ్గించుకోవడం.. మరోవైపు నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారు చేయడం.. వాటి అమ్మకాల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవడం.. ఇలా మూడు లక్ష్యాలతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను మొదలు పెట్టారు. వీటి నిర్వహణలో అంతు లేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాలో పది శాతం పంచాయతీలకు కూడా డంపింగ్ యార్డులు లేకపోవడంతో రోడ్లు, పంట కాలువల చెంతన చెత్త వదిలేస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్, టైర్ల వంటి వాటిని కూడా తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం ముప్పు ఏర్పడుతోంది. జిల్లాలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు 268 ఉన్నాయి. వీటిలో 198 పూర్తిగా పని చేస్తున్నాయని, 46 పాక్షికంగా పని చేస్తున్నాయని, 25 కేంద్రాల్లో వానపాముల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ, వాస్తవంగా పని చేస్తున్నది పది శాతం కూడా లేవు. ఈ కారణంగా పంచాయతీల్లో అశించిన స్థాయిలో చెత్త సమస్య తీరడం లేదు. ఆదాయం కూడా రావడం లేదు. పంచాయతీ పాలకవర్గాలు, అధికారులు, సిబ్బందిలో కంపోస్టు తయారీని దాదాపు వదిలేశారు. చాలా పంచాయతీలకు పారిశుధ్య సిబ్బంది లేకపోవడం కూడా దీనికి ఒక కారణంగా మారింది.
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పేరిట
సర్కారు హడావుడి
పల్లెలు, పట్టణాల్లో
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ
కనీస సదుపాయాలు మృగ్యం
నిధులివ్వని ప్రభుత్వం
10 శాతం కూడా లేని డంపింగ్ యార్డులు

చెత్త గుట్టలు.. స్వచ్ఛ గొప్పలు

చెత్త గుట్టలు.. స్వచ్ఛ గొప్పలు