ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల మోత | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల మోత

Apr 29 2025 12:18 AM | Updated on Apr 29 2025 12:18 AM

ప్రైవేటు కళాశాలల్లో  ఫీజుల మోత

ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల మోత

అమలాపురం టౌన్‌: ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల మోత బాగా పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదటి శిరీష్‌ సోమవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లో పెంచిన ఫీజులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం తగ్గి, ప్రైవేటు కళాశాలల వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచుతున్నాయని ఆరోపించారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు కూటమి నేతల మద్దతు ఉండటం లేదా పరోక్షంగా వారి కనుసన్నల్లో అవి పని చేయడంతో ఫీజుల దందా బాగా పెరిగిపోయిందని ఆరోపించారు. కొందరు పేద విద్యార్థులు పెరిగిన ఫీజులు తట్టుకోలేక చదువులకు దూరమవుతున్నారన్నారు. జిల్లాలోని కొన్ని కళాశాలలు ఏడాదికి రూ.లక్షకు పైగా ఫీజులు గుంజుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌ కమిటీ వేసి, అధిక ఫీజులను నియంత్రించాలని సూచించారు. లేకుంటే వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఉద్యమిస్తుందని శిరీష్‌ హెచ్చరించారు.

డీఎస్సీపై 2న అవగాహన

సదస్సు

మామిడికుదురు: డీఎస్సీపై మే 2న ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ కోనసీమ జిల్లా శాఖ కోశాధికారి సీహెచ్‌ కేశవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమలాపురం ప్రకాశం వీధిలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. పోటీ పరీక్షల కోచింగ్‌ నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు సారథ్యంలో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో పాల్గొనే అభ్యర్థులకు సైకాలజీ మెటీరియల్‌ ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు

23 అర్జీలు

అమలాపురం టౌన్‌: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి 23 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు అందుబాటులో లేకపోవడంతో, అర్జీదారుల నుంచి ఎస్పీ కార్యాలయం స్పెషల్‌ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్‌ ఫిర్యాదులు స్వీకరించారు. వారి విన్నపాలను ఎస్పీ దృష్టిలో పెట్టి, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

సర్వ పృష్ఠ ఆప్తోర్యామ

యాగంతో అనంత ఫలితం

అంబాజీపేట: లోక కల్యాణం కోసం నిర్వహించే యాగాల్లో సర్వ పృష్ఠ ఆప్తోర్యామ యాగం ఎంతో అరుదైనదని, ఇది అనంత ఫలితాలనిస్తుందని ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌కు చెందిన సచ్చిదానంద తీర్థ స్వామి అన్నారు. తొండవరం గ్రామంలో జరుగుతున్న ఈ యాగాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ, 60 ఏళ్ల క్రితం వరకూ ఈ ప్రాంతంలో ఇటువంటి యాగం జరగలేదన్నారు. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి ఆశీస్సులతో 2020లో తాను అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున యాగం నిర్వహించానన్నారు. హరిద్వార్‌లో తెలుగు వారి కోసం గౌతమీ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశామని, గుంటూరుకు చెందిన వాసుదేవశర్మ దీనిని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక్కడ రోజూ రెండు మూడు వేల మందికి భోజనం, ఫలహారం అందిస్తున్నామన్నారు. సరస్వతీ నది పుష్కరాలకు రోజుకు లక్ష మంది వరకూ తెలుగు వారు వచ్చే అవకాశం ఉన్నందున వారికి భోజనం, ఫలహారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని స్వామీజీ వివరించారు.

ఐటీఐలో ప్రవేశానికి

దరఖాస్తుల ఆహ్వానం

రాజమహేంద్రవరం రూరల్‌: పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన విద్యార్థుల నుంచి ఐటీఐలలో మొదటి విడత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఎల్‌ఆర్‌ఆర్‌ క్రిష్ణన్‌ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో iti.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మే 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకుని, రశీదు పొందాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ మే 24 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ధవళేశ్వరం సమీపాన కలెక్టరేట్‌ వెనుక ఉన్న ప్రభుత్వ ఐటీఐలో జరుగుతుందని వివరించారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ ఐటీఐని కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement