
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
కొత్తపేట: అక్రమంగా తరలిపోతున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండల పరిధిలోని మోడేకుర్రు ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎస్సై సురేంద్ర సిబ్బందితో ఆదివారం వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అమలాపురం వైపు నుంచి వస్తున్న వ్యాన్‌లో ఎటువంటి అనుమతులూ లేకుండా తరలిస్తున్న 73 బస్తాల (30 క్వింటాళ్లు) రేషన్ బియ్యాన్ని గుర్తించారు.
ఆలమూరు మండలం నర్సిపూడికి చెందిన వ్యాన్ డ్రైవర్ గుబ్బల వీర వెంకట రమణను అదుపులోకి తీసుకుని, బియ్యాన్ని, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేంద్ర తెలిపారు.