ఉగ్రవాద దాడి మృతులకు నివాళి
అమలాపురం టౌన్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యాన గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక హైస్కూలు సెంటరులో కొవ్వొతుల వెలుగులతో మృతులకు నివాళులర్పించారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ నాయకులు కుడుపూడి త్రినాథ్, కట్టోజు రాము, వేగిరాజు సాయిరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రవణం వేణుగోపాలరావు, వెటరన్ క్రీడాకారిణి మెహబూబ్ షకీలా తదితరులు పాల్గొన్నారు.
మారిన సిలబస్‌పై
అధ్యాపకులకు శిక్షణ
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం సిలబస్ ఈ ఏడాది నుంచి మారింది. ప్రశ్నపత్రంలో కూడా ఒక మార్కు ప్రశ్నలు 10 శాతం ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా టీచర్స్ ఆన్‌లైన్ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ న్యూ సిలబస్ అండ్ క్వశ్చన్ పాటర్న్ పేరిట గురువారం నుంచి అధ్యాపకులకు ప్రారంభమైందని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా అధికారి (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకూ ఈ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందన్నారు. అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లాలోని ఆంగ్ల, తెలుగు, హిందీ అధ్యాపకులకు ఈ శిక్షణ ప్రారంభమైందని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ టైమ్ టేబుల్ ప్రకారం నిపుణులు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నాన్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా వీక్షిస్తూ అధ్యాపకులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు.
పని చేయని సర్వర్లు..
రిజిస్ట్రేషన్లకు ఆటంకం
అమలాపురం టౌన్: సర్వర్లు సక్రమంగా పని చేయకపోవడంతో జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు బుధ, గురువారాల్లో ఆటంకం ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయ విక్రయదారులు ఆయా కార్యాలయాల వద్ద పడిగాపులు పడ్డారు. ఇటీవల కాలంలో తరచూ సర్వర్లు పని చేయక ఈ పరిస్థితి తలెత్తుతోంది. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పట్టణానికి చెందిన ఓ బిల్డర్ రిజిస్ట్రేషన్ పని మీద దాదాపు రెండు గంటల పాటు వేచి వేచి విసుగు చెంది, తిరుగుముఖం పట్టారు. జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సమస్యను వెంటనే చక్కదిద్దాలని క్రయవిక్రయదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉగ్రవాద దాడి మృతులకు నివాళి


