
పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు
అమలాపురం రూరల్: జిల్లాలో పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 25 ఎకరాల విస్తీర్ణం గల స్థలాలను గుర్తించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఎన్నో పథకాలను అందిస్తోందన్నారు. ఆ దిశగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కేవలం భారీ పరిశ్రమల ద్వారా కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేలా పలు విధానాలు ఎంఎస్‌ఎంఈ నూతన విధానంలో ఉన్నాయన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్వోబీ ఎల్‌ఎన్ రాజకుమారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకే పి.ప్రసాద్, ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ జోనల్ మేనేజర్ ఎ.రమణారెడ్డి, ఆర్డీఓలు కె.మాధవి, పి.శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.