సాక్షి,కాకినాడ: జనసేన పార్టీలో కాకినాడ జిల్లా రాజకీయాలు రోజు రోజుకు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ పాత్రపై పార్టీ లోపలే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
మంత్రి దుర్గేష్ పైరవీలపై అసంతృప్తి
కుడా చైర్మన్ పదవిని ముత్తా శశిధర్ ముఖ్య అనుచరుడైన తలాటం సత్యకు కేటాయించాలంటూ మంత్రి కందుల దుర్గేష్ పైరవీలు చేయడం జనసేన వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దుర్గేష్‌కు సంబంధించిన లేఅవుట్లు, వ్యాపార ప్రయోజనాలే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గేష్‌కు అనుకూలమైన వ్యక్తిని ముందుంచి నిర్ణయాలపై ప్రభావం చూపాలన్న ప్రయత్నం జరుగుతోందని కొందరు నేతలు బహిరంగంగానే వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇప్పుడు కీలక పదవులు ఎలా ఇస్తారు? అని ఇతర నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు దుర్గేష్‌ను ప్రశ్నిస్తున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు వంటి ప్రాంతాల్లో పార్టీ కోసం కష్టపడ్డ నేతలను పక్కన పెట్టి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని వారు హెచ్చరిస్తున్నారు.
ఒకే పార్టీ నుంచి ఒకే సామాజిక వర్గానికి, ఒకే నియోజకవర్గానికి రెండు కీలక పదవులు ఇవ్వకూడదన్న పార్టీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కాకినాడ సిటీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట సుధీర్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో కుడా చైర్మన్ పదవి విషయంలో ఏర్పడిన వివాదాన్ని నివారించేందుకు పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబుకు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం గుర్తు చేస్తున్నారు.
తలాటం సత్య కాకినాడ సిటీకి చెందినవారే కావడంతో మరోసారి సిటీ నుంచే పదవి ఇస్తే సమస్యలు తలెత్తవచ్చని పార్టీ పెద్దలకు సూచిస్తున్నారు. కుడా చైర్మన్ పదవిని కాపు సామాజిక వర్గానికే కేటాయించాల్సి వస్తే ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. జగ్గంపేట ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ప్రత్తిపాడు జనసేన నేత కత్తిపూడి బాబీ, లేదా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు పేర్లు చర్చలో ఉన్నాయి.


