కౌలుకునేదెలా! | - | Sakshi
Sakshi News home page

కౌలుకునేదెలా!

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

కౌలుకునేదెలా!

కౌలుకునేదెలా!

రుణాలకు నోచుకోని కౌలు రైతులు

ప్రభుత్వ పథకాలకూ దూరం

18 నెలలుగా పట్టించుకోని ప్రభుత్వం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సాగు పెట్టుబడికి రుణాలివ్వరు.. విత్తనాలు, ఎరువులు అందించరు.. సంక్షేమ పథకాలు వర్తింపజేయరు.. గిట్టుబాటు ధర మాటే మరిచారు.. ఫలితంగా జిల్లాలోని కౌలు రైతులు చక్రబంధంలో చిక్కుకుని నలిగిపోతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండగలా ఉండేది. గ్రామ స్థాయిలో విత్తు మొదలు.. విక్రయాల వరకూ రైతులకు వారి చెంతనే సేవలు అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయం రంగంపై నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శ వస్తోంది. తమ సంక్షేమాన్నయితే పూర్తిగా విస్మరించారని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు.

గుర్తింపులోనే జాప్యం

ఖరీఫ్‌, రబీ సీజన్లలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది. వారికి పంట సాగుదారు హక్కు (సీసీఆర్‌) కార్డు ఇస్తూంటుంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్డు ఆధారంగా విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు అందించడంతో పాటు వారి నుంచి మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేసేవారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కౌలు గుర్తింపులోనే జాప్యం చోటు చేసుకోవడంతో కౌలు రైతులకు ఎరువులు, విత్తనాలు, బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. గడచిన 18 నెలల్లో జిల్లావ్యాప్తంగా 35 వేల మందికి సీసీఆర్‌ కార్డులు మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు ఖరీఫ్‌, రెండు రబీ సీజన్లు వచ్చాయి. మొత్తం ఈ నాలుగు పంటకాలాల్లోనూ తమకు ప్రభుత్వం మొండిచెయ్యే చూపించిందని, ఒక్క రూపాయి కూడా రుణం ఇచ్చిన దాఖలాలు లేవని కౌలు రైతులు వాపోతున్నారు. గత్యంతరం లేక సాగు పెట్టుబడికి బయటి వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

పరిహారంలోనూ మొండిచెయ్యి

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బ తిన్నప్పటికీ నయా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. కేవలం భూమి సర్వే నంబర్ల ఆధారంగా భూయజమానులైన రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ చేసింది. వారు ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు ససేమిరా అనడంతో కౌలు రైతులు నష్టపోయారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకూ ప్రభుత్వం రూ.10 వేల చొప్పున జమ చేసింది కానీ కౌలు రైతులకు మాత్రం మొండిచెయ్యి చూపింది. మరోవైపు ప్రభుత్వం ఒక్క పథకం కూడా తమకు వర్తింపజేయలేదని కౌలుదార్లు గగ్గోలు పెడుతున్నారు.

అప్పులపాలు

ఎకరా భూమికి యజమానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు చెల్లించాలి. ఆ తర్వాతే కౌలుదార్లు సాగుకు ఉపక్రమిస్తారు. విత్తనాల కొనుగోలు, దమ్ములు, వరి నాట్లు వేయడం, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్నింటికీ కలిపి మరో రూ.25 వేలకు పైబడి పెట్టుబడి అవుతుంది. అంటే ఎకరం భూమి కౌలుకు చేయాలంటే రూ.50 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి రైతుకూ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ రుణాలు మాత్రం ఇవ్వడం లేదని కౌలు రైతులు చెబుతున్నారు. దీంతో, వచ్చిన పంట అంతా కౌలుకు, వడ్డీలకే పోతోందని మధనపడుతున్నారు. అదే బ్యాంకుల నుంచి పంట రుణాలిప్పిస్తే తక్కువ వడ్డీ కావడంతో తమకు ఆ మొత్తమైనా మిగిలేదని అంటున్నారు.

ధాన్యం విక్రయాలకూ ఇబ్బందులే...

కౌలు రైతులు పండించిన ధాన్యం విక్రయాల సమయంలో రైతు సేవా కేంద్రాల్లో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కౌలు రైతుల పేరిట ఈ–కేవైసీ చేయకపోవడంతో గత ఖరీఫ్‌లో వారి నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో, వారు దళారులకు తక్కువ రేటుకే ధాన్యం విక్రయించుకోవాల్సి వచ్చింది. దీంతో బస్తాకు రూ.350 వరకూ నష్టపోయారు.

గత ప్రభుత్వ హయాంలో భరోసా

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో తమకు కూడా బ్యాంకుల నుంచి పంట రుణాలిచ్చేవారని కౌలు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాకుండా, ఇతర రైతుల మాదిరిగానే వారికి కూడా వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం వంటివి అందేవి. మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయడం తదితర అనేక విధాలుగా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆదుకునేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement