వనదుర్గమ్మ సన్నిధిలో నేటి నుంచి ఖడ్గమాల పూజ | - | Sakshi
Sakshi News home page

వనదుర్గమ్మ సన్నిధిలో నేటి నుంచి ఖడ్గమాల పూజ

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

వనదుర్గమ్మ సన్నిధిలో నేటి నుంచి ఖడ్గమాల పూజ

వనదుర్గమ్మ సన్నిధిలో నేటి నుంచి ఖడ్గమాల పూజ

టికెట్టు రూ.1,116

ప్రతి శుక్రవారం నిర్వహణ

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వన సంరక్షురాలిగా, రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన ఖడ్గమాల పూజ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతి శుక్రవారం వనదుర్గమ్మ ఆలయంలో చండీ హోమం.. ప్రతి పౌర్ణమి, అమావాస్య నాడు ప్రత్యంగిర హోమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటికి భక్తుల వద్ద నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా ఖడ్గమాల పూజను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. దీనిని ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ పూజకు టికెట్టును రూ.1,116గా నిర్ణయించారు. వనదుర్గ ఆలయ అర్చకుడు, వ్రత పురోహితులు ఈ పూజ నిర్వహిస్తారు. పూజ చేయించుకుంటున్న దంపతులు అమ్మవారికి ఎదురుగా కూర్చుని, అర్చకుడు చెప్పినట్లుగా మంత్రాలు చదువుతూ శ్రీచక్రంపై పసుపు, కుంకుమ, ఇతర ద్రవ్యాలతో పూజ చేస్తారు. పూజ అనంతరం ఆ దంపతులకు వారు పూజ చేసిన అమ్మవారి కుంకుమ, రాగి డాలర్‌, కండువా, రవికల వస్త్రం, 250 గ్రాముల పులిహోర ప్రసాదం అందజేస్తారు. భక్తులు కొబ్బరికాయ, అరటి పండ్లు, పూలు మాత్రం తీసుకురావాలి. మిగిలినవి దేవస్థానం సమకూరుస్తుంది.

దుర్గ గుడిలో మాదిరిగా..

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఖడ్గమాల పూజ మాదిరిగానే ఇక్కడ కూడా ఈ పూజ నిర్వహిస్తారు. ఐదు చదరపు అంగుళాల పరిమాణంలో, ఒకవైపు శ్రీచక్ర యంత్రం, మరోవైపు అమ్మవారి చిత్రం ముద్రించిన యంత్రాలను ఈ పూజలో ఉపయోగిస్తారు. దీని కోసం 50 యంత్రాలు, వంద ఇత్తడి పళ్లాలు, వంద పంచపాత్రలు, ఉద్ధరిణులను వ్రత పురోహిత సూపర్‌వైజర్లు ప్రయాగ అంజిబాబు, దేవులపల్లి సూర్యనారాయణ, డ్యూటీ సభ్యులు నాగాభట్ల రవిశర్మ, కర్రి సూర్యనారాయణమూర్తి తదితరులు దేవస్థానానికి సమర్పించారు. పూజ అనంతరం ఈ యంత్రాలను దేవస్థానం వెనక్కి తీసుకుంటుంది. ఒకవైపు వనదుర్గ అమ్మవారు, మరోవైపు శ్రీచక్ర యంత్రం ముద్రించి ఉన్న చిన్న డాలర్లను మాత్రం భక్తులకు అందజేస్తారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయ మండపం చాలా చిన్నదిగా ఉండటంతో ఏకకాలంలో 20 జంటలకు మించి ఈ పూజ చేసుకునే అవకాశం లేదు. అందువలన ఈ మండపాన్ని 30 అడుగుల ముందుకు విస్తరించనున్నారు. దీని కోసం రూ.40 లక్షలతో ఆలయం మొదటి అంతస్తు, రెండో అంతస్తుకు శ్లాబులు వేయనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు చైర్మన్‌, ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement