అర్చకుల ఆస్తులపై దాడి
● తాళ్లూరు జీయన్న మఠంలో ఘటన
● ఇంటి వెనుక స్థలంలో
పోల్స్, చెట్ల కూల్చివేత
● వ్యక్తిగత కక్షలతో దుశ్చర్యకు
పాల్పడ్డారని బాధితుల ఆవేదన
గండేపల్లి: వ్యక్తిగత కక్షలతో టీడీపీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ పైణ్ని వెంకటేశ్వరరావు, దాపర్తి సీతారామయ్యలు తమ ఆస్తులపై గురువారం దాడులకు పాల్పడ్డారని తాళ్లూరు జీయన్న మఠం వేంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఆరోపించారు. జేసీబీతో తమ ఇంటి వెనుక భాగంలోని సిమెంట్ స్తంభాలు, చెట్లు తొలగించి, తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని మఠాధిపతి, భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, భగవద్ రామానుజాచార్య సేవా ట్రస్ట్ చైర్మన్ పొడుగు ప్రసాదాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి నేపథ్యంలో మఠంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఈ భూ వివాదంపై రెవెన్యూ శాఖ విచారణ నిర్వహించిన సందర్భంగా వెంకటేశ్వరరావు తమపై దూషణకు దిగారని, తమ అంతు చూస్తానంటూ బెదిరించారని అన్నారు. ఆ కక్షతోనే తనతో పాటు కోరుకొండ చక్రధరాచార్యులు, కోరుకొండ నానాజీ ఆచార్యులుకు చెందిన సరిహద్దు స్థలంలో నేడు ఈ దుశ్చర్యకు పూనుకున్నారని అన్నారు. తమ ముత్తాతల కాలం నుంచి మఠంలోనే ఉంటున్నామని, తమకున్నా, లేకున్నా స్వామివారికి కై ంకర్యాలు చేసేవారమని, ఏనాడూ ఇటువంటి దౌర్జన్యం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంటు స్తంభాలు, చెట్లు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించినందుకు గాను మఠానికి చెందిన ముష్టిగూడల సూర్య భాస్కరాచార్యులు, రమేష్ ఆచార్యులపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగారని, దీంతో, వారి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తిందన్నారు. తొలగింపుదార్లను మిగిలిన అర్చకులు ప్రశ్నించడంతో వివాదం ముదిరిందని చెప్పారు. విషయం తెలుసుకున్న అర్చక సంఘం జిల్లా నాయకులు బి.వెంకన్నబాబు, వీఎస్‌ఎన్ మూర్తి, కొత్తలంక శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, మురళి తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, అర్చకులకు అండగా నిలిచారని వివరించారు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వివాదం కోర్టులో ఉన్నందున తమ ఆలయానికి ఎటువంటి పాలక మండలీ లేదని చెప్పారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చైర్మన్ అని చెప్పుకుంటూ ఆలయ సంప్రదాయలకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గూడుతో పాటు కూడు కూడా లేకుండా చేసి, మఠం నుంచి తరిమేసే యత్నాల్లో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే స్వామివారి కల్యాణోత్సవాలకు తమ సహకారం ఉండబోదని ప్రసాదాచార్యులు హెచ్చరించారు.
అర్చకులంటే అలుసా!
అర్చకుల ఆస్తులపై దాడిని వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఒబిణ్ని వీరబాబు తీవ్రంగా ఖడించారు. జీయన్న మఠం అర్చకులంటే అంత అలుసా అని ప్రశ్నించారు. గత పుష్కరాల్లో ఆలయ నిర్మాణ సమయంలోనూ అర్చకులు అనేక అవమానాలకు గురయ్యారని వివరించారు. స్వామి సేవలో పునీతులవుతున్న అర్చక కుటుంబాలపై దాడి హేయమని అన్నారు. అర్చకులకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


