వివాహేతర సంబంధం: యువకుడు దారుణ హత్య

A Young Man Was Brutally Assassinated in Mulugu District - Sakshi

సాక్షి,మహాముత్తారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెంలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన జాడి ప్రవీణ్‌(32) స్థానికంగా కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఊళ్లోకి వెళ్లిన అతడు 10 దాటిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు. ఎంతకూ రాకపోగా తెల్లవారేసరికి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ బోనాల కిషన్‌తోపాటు ఇతర అధికారులు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పదునైన ఆయుదంతో తల వెనక, ముందు భాగంలో పొచిడి హత్య చేసిన ఆనవాళ్లను గుర్తించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు.కాగా, సదరు యువకుడికి గ్రామానికి చెందిన ఓ వివాహితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో వివాహిత సంబంధికులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తమ్ముడు సుదర్శన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

అదుపులో నిందితులు?
ప్రవీణ్‌ను హత్య చేశారని అనుమానిస్తున్న కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో ఈ హత్య చేశారని భావిస్తున్న పోలీసులు.. మరికొంత మంది యువకులను అవసరమైతే పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించినట్లు తెలిసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top