ప్రియురాలు దక్కలేదని.. యువకుడు షాకింగ్‌ నిర్ణయం

Young Man Commits Suicide In Nandyal District - Sakshi

దొర్నిపాడు(కర్నూలు జిల్లా): ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలపరిధిలోని చాకరాజువేముల గ్రామంలో  మంగళవారం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ తిరుపాల్‌ తెలిపిన వివరాల మేరకు.. చాకరాజువేముల గ్రామానికి చెందిన జకరయ్య, రత్మమ్మ దంపతులకు ఒక కుమార్తె,   ప్రవీణ్‌కుమార్, ప్రసన్న కుమార్‌ అనే ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో కుమారులు ఉద్యోగం చేస్తున్నారు. ప్రసన్న కుమార్‌(24) అప్పుడప్పుడు  వైఎస్సార్‌ జిల్లా  జమ్మలమడుగులోని  పిన్ని ఇంటికి వెళ్లేవాడు.

ఈ క్రమంలో అక్కడ  ఓ యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి  వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, లక్ష్మీదేవి యువకుడిని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్నకుమార్‌ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో  విషగుళికలు మింగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి  బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో  కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టం లేక యువతి తల్లిదండ్రులు తమ కుమారుడిని బెదిరించినట్లు  ప్రసన్నకుమార్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల  ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మహేష్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 
చదవండి: మూడేళ్ల క్రితం భర్త మృతి.. ఒంటరి మహిళపై అత్యాచారం ఆ తర్వాత..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top