పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఓ మహిళ కత్తితో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలోఘ ఈ ఘటన చోటుచేసుకున్నట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి. అయితే పోలీసులు మాత్రం దీనిని ఘర్షణగా పేర్కొంటూ సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
టీఎంసీ ఫిర్యాదు
పార్టీ జనరల్ సెక్రటరీ డోలా సేన్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... నిందితురాలు అనుసూయ సాహా మమతా బెనర్జీ ఇంటి వద్దకు వచ్చి బూతులు తిడుతూ, మత్తులో హింసాత్మకంగా దాడికి తెగబడిందని తెలిపారు. అంతేకాకుండా రోడ్డుపై పడుకుని భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ప్రయత్నించినట్లు వ్యాఖ్యనించారు.
పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా స్పందిస్తూ... జెడ్-ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. ఢిల్లీలో తమను దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీ పన్నిన కుట్ర ఇదేనా అని అనుమానం వ్యక్తం చేశారు.
బెంగాల్‌లో అధికారం కోల్పోయిన నాటి నుంచి తమ పార్టీ నాయకులపై దాడులు పెరిగాయని టీఎంసీ ఆరోపిస్తోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో కోల్‌కతాలోని శ్యామ్‌బజార్ ప్రాంతంలో మమతా బెనర్జీ కారుపై రాయి దాడి జరిగింది. మమతాపైనే కాకుండా జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు.


