పసిబిడ్డతో భర్త అంత్యక్రియలకు బాలింత

Wife Attend Husband Funerals With 6 Days Old Baby Chittoor District - Sakshi

పాడె మోసిన సోదరి

కలకడ : భర్త అంత్యక్రియలకు ఆరురోజుల పసికందుతో యువతి హాజరు కావడం కలకడలో ఆదివారం విషాదాన్ని నింపింది. ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతిని విధి చిన్నచూపు చూసింది. ప్రమాదంలో గాయపడిన భర్త ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటాడని ఎదురు చూసిన భార్య కు విగతజీవుడై రావడంతో చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. కలకడవాసులను కళ్లు చెమర్చిన ఈ ఘటన వివరాలు .. కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన పి.గంగాధర (25) శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికాగా, శనివారం తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే దుఃఖాన్ని మింగుకుని తల్లిదండ్రులు ఈ విషయం కోడలు మంగమ్మతో చెప్పకుండా దాచారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడని నమ్మబలికారు. ఆదివారం భర్త మృతదేహం ఇంటికి చేర డంతో మంగమ్మ చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. భర్త లేని జీవితం తనకు వద్దంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. ఆరు రోజుల పసికందుతో భర్త అంత్యక్రియల్లో పాల్గొంది. మూడు కిలోమీటర్లు నడచి సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని చెల్లెలు భవాని  శ్మశానం వరకు నలుగురిలో ఒకరుగా మోసింది. ఈ దృశ్యాలు కలకడవాసుల కలచివేశాయి.(చదవండి: పాపం ఆమెకు తెలియదు.. భర్త శవమై వస్తున్నాడని..!!)

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
రైలు నుంచి జారిపడి వృద్ధుడు.. 
చంద్రగిరి: మండలంలోని ముంగళిపట్టు వద్ద రైలు నుంచి జారిపడి  గుర్తుతెలియని  వృద్ధుడు మృతి చెందాడు. అతనికి సుమారుగా 70 ఏళ్లు ఉంటాయని, చంద్రగిరి–ముంగళిపట్టు మధ్య రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఉంటాడని పాకాల రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ గౌరీశంకర్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పాకాల రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

శ్రీసిటీలో ఇంజినీర్‌
సత్యవేడు: శ్రీసిటీలోని ఈఎంపీ రోడ్డు వద్ద ఆదివారం లారీ ఢీకొని జమిల్‌ కంపెనీ ఇంజినీర్‌ ఎస్‌ మహ్మద్‌హుసేన్‌(30) మృతి చెందారు. రాయచూర్‌(కర్ణాటక)కు చెందిన ఎస్‌.మహ్మద్‌హుసేన్‌ శ్రీసిటీలోని జెమిల్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం తడలో స్నేహితుని ఇంటికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈఎంపీ రోడ్డు వద్ద లారీ ఢీకొంది. మహ్మద్‌ హుసేన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని సత్యవేడు క మ్యూనిటీ వైద్యశాలకు  తరలించారు. భార్య రాయచూర్‌లో ఉంటోంది. ఏడాది కిందటే వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

వేట కొడవలితో వీరంగం
పెద్దతిప్పసముద్రం: మండలంలోని మద్దయ్యగారిపల్లె పంచాయతీ పులగంటివారిపల్లెలో ఓ వ్యక్తి వేటకొడవలితో ఆదివారం సాయంత్రం వీరంగం సృష్టించడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్‌ తన పొలంలోని పంటను ఇతరుల మూగజీవాలు మేశాయని ఆ గ్రహం చెందాడు.  వేటకొడవలితో గ్రామానికి చెందిన సుబ్బమ్మ, వెంకటనారాయణ, గణేశ్, రమణ, శ్రీనివాసులు, హరిపై దాడి చే సి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన గణేశ్‌(22)ను  వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top