24 ఏళ్ల క్రితం పెళ్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డొస్తున్నాడని

Wife Assassinated Husband Due To Extra Marital Affair At Dharmavaram - Sakshi

సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డు తగిలిన భర్తను తానే హతమార్చినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. వివరాలను బుధవారం ధర్మవరం అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమాకాంత్‌ వెల్లడించారు. ధర్మవరంలోని దుర్గానగర్‌కు చెందిన పల్లపు గంగాధర్‌కు 24 సంవత్సరాల క్రితం లక్ష్మీదేవితో వివాహమైంది. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎరికల ముత్యాలు, ఎరికల పుల్లక్క, ఎరికల నగేష్, మరికొందరితో దాదాపు రూ.8 లక్షల వరకు అధిక వడ్డీకి గంగాధర్‌ అప్పులు చేసి భార్య చీరల వ్యాపారానికి సమకూర్చాడు.

కొన్నేళ్లుగా లక్ష్మీదేవి తారకరామాపురానికి చెందిన నారా భాస్కరరెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా తెలుసుకున్న గంగాధర్‌ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతుండడంతో ఎలాగైనా భర్తను అంతమొందించాలని లక్ష్మీదేవి నిర్ణయించుకుంది. తన అన్న వెంకటేష్, ఆమె అల్లుడు సుధాకర్‌కు డబ్బు ఆశ చూపి వారి సాయంతో ఏప్రిల్‌ 8న అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఎల్‌పీ సర్కిల్‌లోని రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద మద్యం మత్తులో పడి ఉన్న గంగాధర్‌పై బండరాయి, ఇనుప పైపులు వేసి, గొంతు నులిమి హతమార్చింది.
చదవండి: తిరుమల బాలుడి కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. కిడ్నాపర్‌ ఎవరంటే..?

మరుసటి రోజు అప్పులు ఇచ్చిన వారే తన భర్తను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో లక్ష్మీదేవి ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తడంతో విషయం తెలుసుకున్న ఆమె, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. బుధవారం ఉదయం వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయారు. హత్యకు దారి తీసిన పరిణామాలను ఈ సందర్భంగా పోలీసులకు నిందితులు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top