దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి.. రూ.85 లక్షలతో పరార్‌

Watch Man Steals 85 Lakhs For Aged Owners At Khairatabad - Sakshi

85 లక్షల విలువైన నగలు, నగదు చోరీ చేసిన వాచ్‌మన్‌ దంపతులు

ఖైరతాబాద్‌: నమ్మకంగా వాచ్‌మన్‌గా చేరిన దంపతులు అర్ధరాత్రి వృద్ధ దంపతులను బంధించి రూ.85 లక్షలు విలువచేసే నగదు, నగలు, డైమండ్‌ ఆభరణాలతో పరారయ్యారు. ఈ ఘటన సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వస్త్ర వ్యాపారం చేసే ఓం ప్రకాష్‌ ఆగర్వాల్, అతని భార్య సంతోష్‌ ఆగర్వాల్‌ చింతలబస్తీ, హిల్‌ కాలనీలో శ్రీవీన్‌ హౌస్‌లో నివాసముంటున్నారు. ఇదే అపార్ట్‌మెంట్‌లో వీరి కోడలు, మనవడు స్వప్న, యజ్ఞ ఉంటుండగా, కొడుకు విదేశాల్లో ఉంటున్నారు. 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులు దీపేష్‌(23), అనిత శశి అలియాస్‌ నిఖిత(21).. వీరి అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్‌గా చేరారు.

అప్పటి నుంచి వీరి కదలికలను పక్కగా గమనించిన వాచ్‌మన్‌ దంపతులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత పథకం ప్రకారం 4వ అంతస్తులో పడుకున్న వృద్ధ దంపతులు ప్రకాష్, సంతోష్‌ ఆగర్వాల్‌ వద్దకు వెళ్లారు. వారిని నిద్రలేపి లోపలికెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి ఇనుప రాడ్‌తో దాడిచేశారు. బీరువా తాళాలు తీసుకొని నగదు, బంగారు, డైమండ్‌ ఆభరణాలు తీసుకుని పారిపోయారు.

ఆ తర్వాత కట్లను విడిపించుకున్న సంతోష్‌ అగర్వాల్‌ ఐదో అంతస్తులో నిద్రిస్తున్న యజ్ఞను లేపి విషయం చెప్పింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.40 లక్షలు విలువచేసే డైమండ్‌ జ్యువెలరీ, 40 లక్షల విలువైన బంగారు, సిల్వర్‌ ఆభరణాలతోపాటు 5 లక్షల నగదు దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సైఫాబాద్‌ డీఐ రాజునాయక్‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. బయటి వ్యక్తులు మరో నలుగురు ఈ చోరీలో పాల్గొన్నట్లు గుర్తించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top