‘వీసా అప్లికేషన్ల’పై డబ్బుల వసూలు

Visa Application Filling Demanding To Money - Sakshi

దరఖాస్తు నింపడానికి డబ్బులు వసూలు!

‘వీసా అప్లికేషన్ల’పై యూఎస్‌ కాన్సులేట్‌ ఫిర్యాదు

కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: అన్‌లైన్‌లో అమెరికా వీసా కోసం దరఖాస్తు నింపుతున్న అనేకమంది డబ్బు వసూలు చేస్తున్నారంటూ అమెరికా కాన్సులేట్‌ అధికారులు బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మైఖేల్‌ పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్‌ కాన్సులేట్‌ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ నిర్వహిస్తోంది. స్టూడెంట్‌ వీసా కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు ఇటీవల వేర్వేరుగా కాన్సులేట్‌లో ఇంటర్వూ్యకు హాజరయ్యారు.    దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించుకుని రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున చెల్లించామని చెప్పారు.

తమ అధికారిక వెబ్‌సైట్‌లో వీసా దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఇది నేరమంటూ మైఖేల్‌ పీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వారితో పూర్తి చేయించుకుని డబ్బు చెల్లించిన కొందరి ఫోన్‌ నంబర్లు జతచేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేదని అధికారులు చెపుతున్నారు. పాస్‌పోర్ట్‌ పొందడానికి, రెన్యువల్‌ చేసుకోవడానికి అనేక ఈ, మీ–సేవ కేంద్రాలు సైతం ఈ సేవల్ని అందిస్తున్నాయి. దరఖాస్తు నింపడం తెలియని, ఇబ్బందిగా భావించేవాళ్లు వీటిని ఆశ్రయించి స్లాట్లు బుక్‌ చేసుకుంటారు. దీని కోసం నిర్ణీత మొత్తాలను చెల్లిస్తారు. ఇది నేరం కానప్పుడు యూఎస్‌ వీసాకు ఆన్‌లైన్‌లో దరఖాస్తును వేరే వ్యక్తుల ద్వారా పూర్తి చేయించడం ఎలా తప్పవుతుందని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా విద్యార్థులతో మాట్లాడాలని నిర్ణయించారు. తామే ఇతరులను ఆశ్రయించి దరఖాస్తును ఇష్టపూర్వకంగా పూర్తిచేయించుకున్నామని చెప్తే కేసు నిలబడదని అధికారులు చెపుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top