ఉద్యోగం ఒకరిది.. జీతం మరొకరికి!

The Victim Request To The Collector In Spandana For Job - Sakshi

ఏడాదిగా సాగుతున్న వ్యవహారం

నా ఉద్యోగం నాకు ఇప్పించండంటూ స్పందనలో కలెక్టర్‌కు బాధితురాలి వినతి

కాజులూరు(తూర్పుగోదావరి): ‘నాకు ఉద్యోగం వచ్చిన విషయం నాకే తెలియకుండా’ఏడాదిన్నర కాలంగా మరొకరు నా విధులు నిర్వహిస్తూ నా పేరుతో జీతం కాజేస్తున్నారని’, తన ఉద్యోగం తనకు ఇప్పించాలంటూ కాజులూరు శివారు రాంజీనగర్‌కు చెందిన బిల్లా రోజా సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2020 మే నెలలో కాజులూరులో డ్వాక్రా యానిమేటర్‌ పోస్టుకి నోటిఫికేషన్‌ పడటంతో బిల్లా రోజా దరఖాస్తు చేసుకున్నారు. 16 మే 2020న రోజాను యానిమేటర్‌గా ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు. 

ఆ మరుసటి రోజున ఆమె విధులకు వెళ్లగా కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా నీ పేరు ఎంపిక కాలేదని తర్వాత కబురు చేస్తామని అధికారులు చెప్పారు. ఇటీవల రోజా ఇంటర్‌నెట్‌ సెంటరుకి వెళ్లి మరో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా ఆన్‌లైన్‌లో ఆమె యానిమేటర్‌గా ఏడాదిన్నర కాలంగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వం నుంచి నెలకు 8,000 చొప్పున జీతం తీసుకుంటున్నట్టు కనిపించింది.

దీంతో ఆమె అవాక్కయి డ్వాక్రా కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా గతంలో మందపల్లి జ్యోతి అనే మహిళ ఈ ఉద్యోగం చేసేదని, ఉన్నత చదువుల కోసం యానిమేటర్‌ ఉద్యోగం మానివేయటంతో నోటిఫికేషన్‌ ఇచ్చారని, ప్రస్తుతం ఆమె తల్లి మందపల్లి నిర్మలకుమారి తన పేరున ఉన్న ఉద్యోగం అనధికారికంగా నిర్వహిస్తూ జీతం తీసుకుంటోందని తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి తన ఉద్యోగం తనకు ఇప్పించాలని బిల్లా రోజా కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top