ప్రాణాలు తీసిన ఈత సరదా

Two Young People Deceased Over Drowned In Water Hyderabad - Sakshi

హయత్‌నగర్‌: ఈత నేర్చుకునేందుకు బావిలో దిగిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం ఆర్‌కే నగర్‌కు చెందిన మోదుగుల పరశురాం, మోదుగుల నర్సింహ అన్నదమ్ములు. వృత్తిపరంగా వీరిద్దరూ డ్రైవర్లు. ఇద్దరికీ ఇద్దరు చొప్పున కుమారులున్నారు.

నర్సింహ చిన్న కొడుకు దుర్గాప్రసాద్‌ (12) తట్టి అన్నారం ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పరశురాం కొడుకు శ్రీకాంత్‌ (15) అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం నర్సింహ పెద్ద కొడుకు రాఘవేందర్‌తో కలిసి చిన్న కొడుకు దుర్గాప్రసాద్, పరశురాం కొడుకు శ్రీకాంత్‌లు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈత నేర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లిద్దరూ నీటిలో మునిగిపోయారు.

ప్రమాదాన్ని పసిగట్టి బావిలోనే ఉన్న రాఘవేందర్‌ కేకలు వేయడంతో సమీపంలోనే పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు హుటాహుటిన వచ్చి దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లను నీటిలోంచి బయటికి తీశారు. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే వీరిద్దరూ మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మొదటి రోజునే దుర్ఘటన జరగడం విద్యార్థుల కుటుంబ సభ్యులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top