మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి సంస్థకు భారీ టోకరా.. ఇద్దరు అరెస్టు

Two Held For Duping Former Union Minister T Subbarami Reddy Wife Organisation - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి భార్య ఇందిరా రెడ్డి చైర్‌పర్సన్, ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న గాయత్రి ప్రాజెక్టస్‌ లిమిటెడ్‌ (జీపీఎల్‌) సంస్థకు భారీ టోకరా వేసిన కేసులో ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ఛాంపియన్‌ ఫిన్‌సెక్‌ లిమిటెడ్‌ (సీఎఫ్‌ఎల్‌) డైరెక్టర్లు నిందితులుగా గుర్తించి, అక్కడే అరెస్టు చేసి తీసుకువచ్చామని సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి సోమవారం వెల్లడించారు.

వివిధ రకాలైన నిర్మాణాలు, హైవేల కాంట్రాక్టులు చేపట్టే జీపీఎల్‌ సంస్థ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్‌లో ఉంది. కొన్నాళ్ల క్రితం సీఎఫ్‌ఎల్‌ డైరెక్టర్లు చేతన్‌ బాలుబాయ్‌ పటేల్, హర్షవర్ధన్‌ అవినాష్‌ ప్రదాన్‌ జీపీఎల్‌ సంస్థను సంప్రదించారు. వీరి అవసరాలకు రూ.11.5 కోట్లు రుణం ఇస్తామంటూ ముందుకు వచ్చారు. జీపీఎల్‌కు చెందిన 69,63,000 షేర్లు తనఖా పెట్టుకుని ఈ రుణం ఇప్పించ్చేలా, అందుకు 1 శాతం కమీషన్‌ సీఎఫ్‌ఎల్‌కు చెల్లించేలా వీరి మధ్య ఒప్పందం కుదిరింది.

దీంతో జీపీఎల్‌ సంస్థ ప్రాథమికంగా ఒక్కోటి రూ.33.05 విలువైన (అప్పటి విలువ) 3.25 లక్షల షేర్లను సీఎఫ్‌ఎల్‌కు  బదిలీ చేసింది. అయితే నిర్దేశిత గడువు ముగిసినా సీఎఫ్‌ఎల్‌ మాత్రం గాయత్రి సంస్థకు ఎలాంటి రుణం మంజూరు చేయించలేదు. అంతటితో ఆగని సీఎఫ్‌ఎల్‌ సంస్థ తమ వద్ద ఉన్న జీపీఎల్‌ షేర్లను వారి అనుమతి లేకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించింది.

ఈ విషయం తెలుసుకున్న జీపీఎల్‌ సంస్థ ఈ ఏడాది జూలైలో సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా అధికారులు సీఎఫ్‌ఎల్‌ డైరెక్టర్లు అవినాష్‌ ప్రధాన్, చేతన్‌ బాలుబాయ్‌ పటేల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇరువురినీ ముంబైలో అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు.  

     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top