అరకు: లోయలో పడ్డ బస్సు: నలుగురు మృతి‌

Tourist Bus Fell Into Cave In Araku - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి డముక వద్ద శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్‌ బస్సు లోయలో పడింది. దీంతో  నలుగురు మృతి చెందగా 10 మందికిపైగా గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అరకునుంచి హైదరాబాద్‌ తిరిగివెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసు బృందాలు, 108 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఎస్‌కోట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ విజయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మెరుగైన చికిత్స అందించండి: సీఎం జగన్‌
అమరావతి :
విశాఖ జిల్లా అనంతగిరి ఘాట్ ‌రోడ్డులో డముకు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై సీఎంఓ అధికారులను ఆరా తీశారు. జరుగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశింశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 

సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్‌ : అరకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి
న్యూఢిల్లీ : అరకు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top