‘లోన్‌ యాప్‌’ కేసులో మరో ముగ్గురి అరెస్ట్‌

Three more arrested in Lone App case - Sakshi

పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రధాన నిందితుడు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో లోన్‌ యాప్‌ వేధింపులు భరించలేక దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసులు గుజరాత్‌కు చెందిన ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు.

లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో బాధిత కుటుంబంలోని చిన్నారులకు రూ.10 లక్షల సాయాన్ని అధికార యంత్రాంగం ద్వారా అందజేశారు.

లోన్‌ యాప్‌ కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన హ్యాండీ లోన్, స్పీడ్‌ లోన్‌ యాప్‌ సహాయకులుగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పలు ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.

గుజరాత్‌లోని షెల్‌ కంపెనీ యజమానులుగా ఉన్న అదే రాష్ట్రంలోని సబర్కత జిల్లా లిల్పూర్‌ ప్రాంతానికి చెందిన పటేల్‌ నితిన్‌కుమార్‌ రమేష్‌భాయి(19), గాంధీనగర్‌లోని ముఖిన్‌పథ్‌కు చెందిన పటేల్‌ మిలన్‌కుమార్‌ రాజేష్‌భాయి (26), రాభారి విధాన్‌ (26)తో పాటు ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు.

అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వీరితోపాటు కొద్ది రోజుల కిందట తెలంగాణలోని బండారిగూడేనికి చెందిన గోవింద్‌ రాజేంద్రప్రసాద్‌ను కూడా పోలీసులు హైదరాబాద్‌లో పట్టుకున్నారు. దీంతో లోన్‌ యాప్‌ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్‌ చేశారు. కేవలం 20 రోజుల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. మీడియా సమావేశంలో అడిషనల్‌ ఎస్పీలు ఎం.రజని, జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top