కదిరి: గవర్నమెంట్‌ టీచర్‌ హత్య.. పార్థీ గ్యాంగ్‌ పనేనా? 

Thieves Assassinate Government School Teacher At Kadiri Updates - Sakshi

సంచలనం రేపిన కదిరి ఘటన 

అప్రమత్తమైన పోలీసులు 

దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు  

మధ్యప్రదేశ్‌కూ ఓ బృందం 

అనంతపురం క్రైం/ కదిరి: కదిరి ఎన్‌జీఓ కాలనీలో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన జిల్లాలో  సంచలనం రేకెత్తించింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండిళ్లలో చోరీకి తెగబడ్డారు. నగల అపహరణతో ఆగకుండా ఉషారాణి (47) అనే టీచర్‌ను హతమార్చి..పక్కింట్లో ఉండే టీస్టాల్‌ రమణ భార్య శివమ్మనూ తీవ్రంగా గాయపరిచారు. అది కూడా జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ తరహా దొంగతనాలు జిల్లా, అంతర్‌ జిల్లాల దొంగలు చేసే అవకాశం లేదని, మధ్యప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన ‘పార్థీ గ్యాంగ్‌’ పని అయ్యిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

రంగంలోకి ప్రత్యేక బృందాలు 
సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడానికి పోలీసు శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి..పోలీసులకు తగిన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో వేలిముద్రలు, ఇతరత్రా ఆధారాలు సేకరించారు. ఈ తరహా కేసుల ఛేదింపులో అనుభవం కల్గిన పోలీసు అధికారులు, సీసీఎస్‌ కానిస్టేబుళ్లను ప్రత్యేక బృందాల్లో నియమించారు. ఈ బృందాలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి.

కదిరి సమీపంలోని టోల్‌గేట్‌తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్‌పోస్టులు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటిలో అనుమానితుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. కదిరి ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన పులివెందుల, మదనపల్లి, హిందూపురం తదితర ప్రాంతాలకూ బృందాలను పంపి, ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలించేందుకు చర్యలు చేట్టారు. పార్థీ గ్యాంగ్‌ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నందున మధ్యప్రదేశ్‌కూ ఓ బృందాన్ని పంపుతున్నట్లు ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగానే ఛేదిస్తామని చెప్పారు. 

లాడ్జీల్లో తనిఖీలు 
ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవరైనా వచ్చి బస చేశారా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు కదిరి పట్టణంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 15 లాడ్జీల్లో తనిఖీలు చేయడంతో పాటు సీసీ ఫుటేజీ కూడా పరిశీలించారు. అలాగే పాత నేరస్తులపై నిఘా వేశారు.   

శోకసంద్రంలో చీకిరేవులపల్లి 
అమడగూరు : దొంగల చేతిలో ప్రభుత్వ టీచర్‌ ఉషారాణి హత్యకు గురికావడంతో మండలంలోని చీకిరేవులపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి, ఉషారాణి దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. శంకర్‌రెడ్డి ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్‌ క్రాస్‌ హైసూ్కల్‌లో బయోలాజికల్‌ సైన్స్‌ టీచర్‌ కాగా.. ఉషారాణి ఓడీచెరువు జెడ్పీ హైస్కూల్‌లో ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రణీత్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... చిన్నకుమారుడు దీక్షిత్‌రెడ్డి విశాఖపట్నంలో మెడిసిన్‌ చదువుతున్నారు.

ఉషారాణి మృతదేహాన్ని కదిరి నుంచి చీకిరేవులపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, తోటి ఉపాధ్యాయులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆమె మృతదేహంపై పడి కుమారులు, భర్త రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఎంపీపీ గజ్జల ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కడగుట్ట కవితతో పాటు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఉషారాణి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్ధారెడ్డి పరిశీలించి..కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top