దొంగలొస్తున్నారు జాగ్రత్త..!

Thieves Are Provoked By Targeting Locked Houses      - Sakshi

గోదావరిఖని: తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. మూడురోజుల్లో మూడిళ్లలో చొరబడ్డారు. మూడు రోజుల క్రితం స్థానిక శారదానగర్‌ ఆర్టీసీ కాలనీకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి నాగేందర్‌ ఇంటి తాళాలు పగులగొట్టారు. బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో ఇలాగే చొరబడినా.. విలువైన వస్తువులేమీ ఎత్తుకెళ్లదు. వీటిపై ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.

ఎన్టీపీసీ జ్యోతినగర్‌ కృష్ణాకాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి రూ.58వేల విలువైన బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై ఎన్టీపీసీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  కొద్ది నెలల కిందట మార్కండేయకాలనీలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇటీవల కాలంలో చోరీల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో మూడు చోరీలు జరగడంతో తాళాలు వేసి ఊరికి వెళ్లేవారు భయాందోళనకు గురవుతున్నారు. మూడు చోరీలు ఒకేలా జరగడంతో ఏదైనా ముఠా ఈ ప్రాంతంలో సంచరిస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు దృష్టి సారించి చోరీలపై నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.

నిఘా పెంచాం
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి పూట గస్తీ పెంచాం. నిత్యం తిరిగే పెట్రోలింగ్‌ కార్లతోపాటు బ్లూకోల్ట్స్‌ పెట్రోలింగ్, రెండు అదనపు పెట్రోలింగ్‌ ఏర్పాటు చేశాం. సీఐ, ఎస్సై క్రాస్‌ చెకింగ్‌ ఉంటోంది. ఎన్టీపీసీ క్రిష్ణానగర్, శారదానగర్‌ ఆర్టీసీ కాలనీల్లో జరిగిన దొంగతనాల తీరు వేర్వేరుగా ఉంది. అయినప్పటికీ సీసీ కెమెరాల పుటేజీ, నిందితులు వేలిముద్రలు సేకరించాం. దొంగలను త్వరలో పట్టుకుంటాం. 
– గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ 

(చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top