పెసర్లంక, దోనేపూడి తిరునాళ్ల రక్తసిక్తం

Tension in two villages in Kollur zone of Guntur district - Sakshi

గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఉద్రిక్తత  

ఇరువర్గాల మధ్య పరస్పరం దాడులు, కత్తిపోట్లు  

13 మందికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం 

కొల్లూరు(వేమూరు): గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక, దోనేపూడి గ్రామాల్లో ఆదివారం రాత్రి జరిగిన తిరునాళ్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాత కక్షల నేపథ్యంలో చిన్న వివాదం ముదిరి కత్తి పోట్లు, కర్రలతో దాడులకు దారితీసింది. ఇరు వర్గాల్లో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పెసర్లంకలో జరుగుతున్న తిరునాళ్లలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని.. బైక్‌ తగిలిందనే కారణంతో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.

కర్రలు, ఇటుక రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు వర్గాలకూ చెందిన 10 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. అందరికీ తలలు పగలడంతో 108 వాహనాల్లో తెనాలి వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న గళ్లా సాంబశివరావును గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు రెండు వర్గాలకూ చెందిన మొత్తం 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

దోనేపూడిలో కత్తులతో దాడి.. 
ఇదిలా ఉండగా దోనేపూడి తిరునాళ్లలోనూ ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పాత కక్షల నేపథ్యంలో కొల్లూరుకు చెందిన యువకుల మధ్య జరిగిన గొడవ కత్తి పోట్లకు దారితీసింది. కనపాల ప్రశాంత్, కనపాల చందు, చొప్పర శరత్‌కుమార్‌లపై చొప్పర జయచంద్ర, చొప్పర సుధాకర్‌లు కత్తితో దాడి చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. గాయపడిన ముగ్గురినీ తెనాలి, గుంటూరుల్లోని ఆస్పత్రులకు తరలించారు. కొల్లూరు ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ రెండు కేసులనూ దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top