జ్యుడీషియల్‌ విచారణ | Sakshi
Sakshi News home page

జ్యుడీషియల్‌ విచారణ

Published Sat, Sep 18 2021 3:47 AM

Telangana High Court Orders Magisterial Inquiry Into Death Of Saidabad Rape Accused - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరేళ్ల బాలికను చిదిమేసిన పల్లకొండ రాజు రైలు కిందపడి చనిపోయిన ఘటన పై హైకోర్టు జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా వరంగల్‌ మూడో మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను నియమించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని సదరు మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌ రావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మా సనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాజు పోస్టుమార్టం వీడియోను వరంగల్‌ జిల్లా చీఫ్‌ జడ్జికి శనివారం సాయంత్రం లోగా పెన్‌డ్రైవ్‌లోగానీ, సీడీలోగానీ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా చీఫ్‌ జడ్జి వీలై నంత త్వరగా ఆ వీడియోలను హైకోర్టు జ్యుడీషి యల్‌ రిజిస్ట్రార్‌కు అందజేయాలని సూచించింది.

అత్యవసర విచారణలో..
పల్లకొండ రాజు మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, దీనిపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా.. హైకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. రాజు ఆత్మహత్య ఘటనపై అనుమా నాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. వాస్తవాలు తేల్చడం కోసం న్యాయ విచారణ చేపట్టాల్సిన అవ సరం ఉందని పేర్కొంది. ప్రభుత్వం రాజుది ఆత్మ హత్య అని పేర్కొంటుండగా, పిటిషనర్లు హత్య అంటున్నారని.. ఈ నేపథ్యంలో సీఆర్‌పీసీలో నిర్దేశించిన మేరకు విచారణ జరపడం తప్పనిసరని తెలిపింది. రాజు మరణానికి సంబంధించి సమా చారం తెలిసినవారు.. విచారణ అధికారి ఎదుట హాజరై వివరాలు తెలపవచ్చని సూచించింది.

అరెస్టు చేశామని కేటీఆరే ప్రకటించారు
పిటిషనర్‌ తరఫున న్యాయవాది వెంకన్న వాదనలు వినిపించారు. రాజును అరెస్టు చేశామని మంత్రి కె.తారకరామారావు స్వయంగా ప్రకటించారని ధర్మాసనానికి విన్నవించారు. ‘‘రాజును ఎన్‌కౌంటర్‌ చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అతడిని వదిలిపెట్టబోమని బాహాటంగానే చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూడా రెండు రోజుల్లో ఫలితం వస్తుందని వ్యాఖ్యానించారు. ఈనెల 9న బాలిక హత్యాచారానికి గురికాగా.. 10వ తేదీన రాజు భార్య, తల్లిని సైదాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని, 15వ తేదీ వరకు నిర్బంధించారు. రాజు ఆచూకీ చెప్పాలంటూ వేధింపులకు గురిచేశారు.

15న రాజు ఆచూకీ దొరికిన తర్వాత వారిని విడిచిపెట్టారు. రాజును ఎన్‌కౌంటర్‌ చేస్తామని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. ఆ మరునాడే రైలు పట్టాల వద్ద రాజు మృతదేహం దొరికింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే.. పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని హత్య చేశారని.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై సీఆర్‌పీసీ 176(1)(ఎ) సెక్షన్‌ ప్రకారం న్యాయ విచారణకు ఆదేశించండి. బాలిక హత్యాచార ఘటనలో రాజు నిందితుడిగా ఉన్నా.. అతడిని చట్టప్రకారం కోర్టులో హాజరుపర్చి, నేరం రుజువైతే శిక్షించి ఉండాల్సింది..’’ అని న్యాయవాది పేర్కొన్నారు. రాజు కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇప్పించాలని ధర్మాసనానికి విన్నవించారు.

అది ముమ్మాటికీ ఆత్మహత్యే..
రాజును పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదని.. అది ముమ్మాటికీ ఆత్మహత్యేనని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ‘‘ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు, సందేహాలకు ఆస్కారం లేదు. రాజు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడిన వెంటనే.. రైలు డ్రైవర్లు ఇద్దరు అది గుర్తించి, స్థానిక రైల్వే అధికారులకు వాకీటాకీలో సమాచారం అందించారు. మరో ఐదుగురు ఇండిపెండెంట్‌ సాక్షులు కూడా రాజు ఆత్మహత్య చేసుకున్నాడని వాంగ్మూలాలు ఇచ్చారు.

ఆ వాంగ్మూలాలను రైల్వే పోలీసులు కూడా రికార్డు చేశారు. పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిగా వీడియో తీశాం. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. వారు అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించడం అంటే కోర్టుల విలువైన సమయాన్ని వృధా చేయడమే’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘పోస్టుమార్టం, అంత్యక్రియలు అయిపోయాయా?.. చాలా వేగంగా పూర్తి చేశారు..’ అని వ్యాఖ్యానించింది. ఘటనపై జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
   

Advertisement
 
Advertisement