ఎస్‌బీఐకి మీనా జ్యువెలర్స్‌ కుచ్చుటోపీ

Telangana: CBI Books Case Against Meena Jewellers For Cheating SBI - Sakshi

రూ.364 కోట్ల మేర మోసగించిన సంస్థ 

కేసు నమోదు చేసిన బెంగళూరు సీబీఐ 

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను రూ.364 కోట్లు మోసగించిన వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన మీనా జ్యువెలర్స్‌ సంస్థతో పాటు డైరెక్టర్లపై బెంగళూరు సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. మీనా జ్యువెలర్స్‌ ప్రమోటర్లు ఉమేష్‌ జెత్వాని, అతడి భార్య హేమ, కుమారుడు కరణ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఎస్‌బీఐ డీజీఎం ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్యలు చేపట్టినట్లు తెలియగా, 2015–19 మధ్య కాలంలో మీనా జ్యువెలర్స్‌ ప్రమోటర్లు నకిలీ పత్రాలతో బ్యాంకు నుంచి క్రెడిట్‌ పొంది, ఆ రుణాలను ఇతర సంస్థలు, ఉపయోగాలకు మళ్లించినష్టాలుగా చూపించినట్టు ఎస్‌బీఐ డీజీఎం ఫిర్యాదులో వెల్లడించారు.

మీనా జ్యువెలర్స్‌ హైదరాబాద్‌ కేంద్రంగా మూడు ఔట్‌లెట్లు నిర్వహిస్తోంది. బంగారం, వజ్రాలు, వెండి, ప్రీమియం గడియారాలు, అత్యాధునిక మొబైల్‌ ఫోన్ల వ్యాపారం చేస్తోంది. 2001లో ఫర్మ్‌ సంస్థగా మొదలై, 2007లో లిమిటెడ్‌ కంపెనీగా మారింది.  

ఫోరెన్సిక్‌ ఆడిట్‌తో వెలుగులోకి... 
బ్యాంకులను మోసం చేసేందుకు ఖాతా బుక్కులను తారుమారు చేసినట్లు ఎస్‌బీఐ థర్డ్‌ పార్టీ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో బయటపడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఔట్‌లెట్లలో క్లోజింగ్‌ స్టాక్‌ ఎక్కువగా చూపించి, బ్యాంకుకు అందించిన స్టాక్‌లో వ్యత్యాసాలు వచ్చాయని, వ్యాట్‌ లెక్కల్లో కూడా అవకతవకలకు పాల్పడ్డారని తేలిందని పేర్కొన్నారు. ఇద్దరు గ్యారెంటీర్లు మనోజ్‌ గన్వానీ, భావనా గన్వానీ సంతకాలను ప్రమోటర్లు ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులో స్పష్టంచేశారు.

ఈ విచారణలో మీనా జ్యువెలర్స్‌కు చెందిన మరో రెండు కంపెనీలు మీనా జ్యువెలర్స్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మీనా జ్యువెలర్స్‌–డైమండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమేయం కూడా ఉన్నట్లు బయటపడినట్లు వెల్లడించారు. ఈ రెండు కంపెనీలపైనా ఎస్‌బీఐ ఫిర్యాదు చేయడంతో వాటిపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది.

2016 నుంచి 2020 మధ్య కాలంలో మీనా జ్యువెలర్స్‌ రూ.906 కోట్లు వ్యాపారం చేసిందని, అయితే క్యాష్‌ క్రెడిట్‌ ఖాతాలో రూ.110 కోట్ల రసీదులనే చూపించినట్లు వెల్లడైంది. మొత్తంగా మూడు కంపెనీల పేరిట రూ.364 కోట్లు రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉందని, అనేకసార్లు నోటీసులిచ్చినా కంపెనీ ప్రమోటర్లు స్పందించలేదని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు రావడంతో సీబీఐ కేసులు నమోదుచేసింది.      

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top