బైక్‌పై వెళ్తుండగా పిడుగు పడి..

Telangana: Bike Struck By Lightning In Mancherial Two People Passed Away - Sakshi

తల్లి, కుమారుడు మృతి 

తండ్రి పరిస్థితి విషమం.. మంచిర్యాలలో ఘటన 

మంచిర్యాలక్రైం: పెళ్లయిన చాలాకాలం తర్వాత పుట్టిన కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ హాయిగా జీవనం సాగిస్తోంది ఆ కుటుంబం. పిల్లాడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా పడిన పిడుగు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా,  భర్త తీవ్రగాయాల పాలయ్యారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌ పాత పోలీస్‌స్టేషన్‌ సమీపంలో అందె వెంకటేశ్, మౌనిక దంపతు లు నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు శ్రీయాన్‌(18 నెలలు)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

తిరిగి ఇంటికి వస్తుండగా ఫ్లై ఓవర్‌బ్రిడ్జిపైకి రాగానే పిడుగుపడింది. ముగ్గురూ కిందపడిపోగా, మౌనిక(28), శ్రీయాన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన వెంకటేశ్‌(32)ను కరీంనగర్‌కు తరలించారు. గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు సీసీసీ నాగార్జున కాలనీకి చెందిన మౌనికతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వెంకటేష్‌ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మౌనిక, శ్రీయాన్‌ మృతిచెందడం, వెంకటేశ్‌ ప్రాణాపాయస్థితిలో ఉండటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా, కలెక్టర్‌ భారతి హోళికేరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మౌనిక, శ్రీయాన్‌ మృతదేహాలను చూసి చలించిపోయారు.  మృతుల కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్, తహసీల్దార్‌ రాజేశ్వర్‌ను భారతి ఆదేశించారు. 

అవే కారణమై ఉండొచ్చు.. 
నడుస్తున్న వాహనంపై పిడుగుపడటమనేది అనూహ్యమైన ఘటన అని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఉన్నతాధికారిణి డాక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకున్న ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సెల్‌ఫోన్లు, ఇనుప వస్తువులు వాహకాలుగా పనిచేసి ఎక్కువగా విద్యుత్‌ తరంగాలను ఆకర్షిస్తాయని తెలిపారు. మేఘాల రాపిడి సమయంలో వీటిలో ఏదైనా విద్యుత్‌ను ఆకర్షించి ఉంటుందని, అదే ఘటనకు కారణమై ఉండొచ్చని ఆమె వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top