ఫొటోగ్రాఫర్‌ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం? | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్‌ హత్య వెనుక ‘టీడీపీ’ నేత హస్తం?

Published Sat, Jan 7 2023 5:07 PM

TDP Leader Hand Behind Photographer Assassination In Konaseema District - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన మండపేటలో ఫొటోగ్రాఫర్‌ను పీక నులిమి చంపేశారు. నూతన సంవత్సర వేడుకల వేళ మండపేట బైపాస్‌ రోడ్డులోని ఒక లే అవుట్‌లో ఆ ఫొటోగ్రాఫర్‌ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తీరా తీగ లాగితే డొంక కదిలింది. అనుమానితులను పోలీసులు తమదైన శైలిలో విచారించారు.

పోస్టుమార్టం నివేదికలో ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. ఈ హత్య వెనుక పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులో కీలక నిందితునిగా ఉన్న అతడి అనుచరుడు పరారీలో ఉండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. అసలు ఈ హత్యకు, ఆ మాజీ ప్రజాప్రతినిధికి మధ్య సంబంధం ఏమిటి, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతోంది. 

మండపేటకు చెందిన ఫొటోగ్రాఫర్‌ కొనిజాల సురేష్‌ (28) డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి వెళ్లి శవమై తేలాడు. తొలుత పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా నాలుగు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మండపేట బైపాస్‌ రోడ్డులోని ఓ లే అవుట్‌లో ఆ రోజు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి.

ఇందులో పట్టణ టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కారు డ్రైవర్‌తో కలిసి సురేష్‌ పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ డ్రైవర్‌తో పాటు మరికొందరిని తమదైన శైలిలో విచారించి, సురేష్‌ హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితుల పేర్లను సేకరించారు. వారిలో సదరు మాజీ ప్రజాప్రతినిధి ప్రధాన అనురుడు కూడా

ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అతడితో పాటు మరికొందరు పరారీలో ఉండటంతో వారి కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.  హతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి కుటుంబ సభ్యులు ఆ మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేసేవారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరికొందరు అనుమానితుల పేర్లు విచారణలో పోలీసులకు చెప్పినట్టుగా హతుని సోదరుడు ఫోన్‌ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం సంచలనమైంది.

విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు, అనుమానితుల కాల్‌డేటా వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మండపేట వచ్చి అనుమానితులను విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ సు«దీర్‌కుమార్‌రెడ్డి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో సురేష్‌ మెడ భాగంలో ఎముకలు విరిగి ఉన్నట్టు నిర్ధారణ అయింది.
చదవండి: కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో 4 ఏళ్ల ప్రేమ.. బర్త్‌డే పేరుతో!

దీంతో అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. పరారీలో ఉన్న అనుమానితులు దొరికితే మాజీ ప్రజాప్రతినిధి పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా విచారణ చేస్తున్నామని మండపేట టౌన్‌ సీఐ పి. శివగణేష్‌ చెప్పారు. కేసులోని ప్రధాన నిందితులను ఆధారాలతో సహా పట్టుకుంటామని అన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement