‘రాయదుర్గం’లో ఎన్‌ఐఏ సోదాలు! | Suspicion Over Bomb Blast In Bengaluru Rameshwaram Cafe, More Details Inside | Sakshi
Sakshi News home page

Rameshwaram Cafe Blast Case: ‘రాయదుర్గం’లో ఎన్‌ఐఏ సోదాలు!

Published Wed, May 22 2024 5:37 AM

Suspicion over bomb blast in cafe

రిటైర్డ్‌ హెచ్‌ఎం అబ్దుల్‌ సాహెబ్‌ కుమారుడు సుహేల్‌ విచారణ

ఉగ్రవాదులతో సంబంధాలే కారణం?

అరెస్ట్‌..  బెంగళూరుకు తరలింపు

రాయదుర్గం:  రాయదుర్గం పట్టణంలోని ఉర్దూ (ఏఏఐ) పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ సాహెబ్‌ నివాసంలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించడం అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 4:30  గంటలకే రాయదుర్గంలోని నాగులబావివీధిలో ఉన్న అబ్దుల్‌ సాహెబ్‌ ఇంటికి చేరుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఉదయం తొమ్మిది గంటల వరకూ ఇంట్లోనే విచారణ చేశారు. 

అనంతరం అబ్దుల్‌ సాహెబ్‌ కుమారుడు సుహేల్‌ను అదుపులోకి తీసుకుని పటిష్ట పోలీసు భద్రత నడుమ రాయదుర్గం అర్బన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతని వాట్సాప్‌ చాటింగ్, ల్యాప్‌ట్యాప్‌లో ఫైళ్లు, ఆన్‌లైన్‌ లావాదేవీలపై మరో మూడు గంటలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం సుహేల్ను అరెస్టు చేసి బెంగళూరు ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా అబ్దుల్‌ సాహెబ్‌ ఇంట్లో విచారణ సమయంలో ఆ వీధిలోకి  ఎవరూ రాకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ..
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ సాహెబ్‌కు సుహేల్, మాతిన్‌ సంతానం. పెద్ద కుమారుడు సుహేల్‌ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మాతిన్‌ స్థానికంగా బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే తన మకాంను హైదరాబాద్‌కు మార్చిన సుహేల్‌ తరచూ బెంగళూరు వెళ్లి వచ్చేవాడు. నెలరోజుల క్రితమే బళ్లారికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న సుహేల్‌ అప్పటి నుంచి రాయదుర్గంలోని తన స్వగృహంలోనే ఉంటున్నాడు. 

కేఫ్‌లో బాంబు పేలుడుపై అనుమానాలు..
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్‌ కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సీసీ పుటేజీ ఆధారంగా 30 ఏళ్ల వయసు కలిగిన యువకుడు కేఫ్‌లోని హ్యాండ్‌వాష్‌ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగు పడేసి వెళ్లినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. అది పేలడంతోనే ప్రమాదం జరిగినట్టు తేల్చారు. దీనికి ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. 

ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడితో రాయదుర్గం పట్టణానికి చెందిన సుహేల్‌ వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఇరువురి సంబంధాలపై మరింత లోతుగా విచారణ చేసేందుకే సుహేల్‌ను అరెస్టు చేసి బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. అయితే నిందితుడు ఎక్కడా మీడియా కంటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. 

ఎన్‌ఐఏ అదుపులో వికారాబాద్‌ పండ్ల వ్యాపారి?
వికారాబాద్‌: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఈ ఏడాది మార్చి 1న జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వికారాబాద్‌లో ఒక పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇతని స్వస్థలం పూణే అని, నాందేడ్‌లోనూ పండ్ల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. అతడిపై కర్నాటకలో పలు కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో శిక్ష సైతం పడినట్టు ఎన్‌ఐఏ అధికార వర్గాల తెలిపాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement