ప్రతీకార హత్యకు ప్లాన్‌ చేసిన నిందితులు..

Supari Gang Arrested In Suryapet District - Sakshi

సాక్షి, కోదాడ(సూ‍ర్యాపేట): తన అన్నను చంపిన వాడిని చంపాలని హత్యకు ప్లాన్‌ చేసిన వ్యక్తితో పాటు సుపారీ గ్యాంగ్‌ను రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు.  వివరాలను మంగళవారం రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శివరాంరెడ్డి వెల్లడించారు. కోదాడ మండలం నల్ల బండగూడెం శివారు రామాపురం క్రాస్‌ రోడ్‌కు చెందిన గుగులోతు సురేష్‌ గతేడాది సిరిసిల్ల జిల్లా రామోజీపేటలో డీజే నడిపిస్తూ అక్కడ బస్వరాజు తిరపతయ్యను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి ఇంటిలో అద్దెకు ఉంటూ ఆయన భార్యతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. గమనించిన తిరపతయ్య అతడిని మందలించాడు. దీంతో అడ్డుగా ఉన్న  అతడిని ఎలాగైనా హత్యచేయాలని సురేష్‌ స్నేహితుల సాయంతో తిరపతయ్యను దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ కేసులో జైలు వెళ్లి వచ్చి స్వగ్రామంలో ఉంటున్నాడు. 

అన్నను చంపిన వాడిని హత్య చేయాలని..
తన అన్నను చంపిన వాడిని హత్యచేయాలని తిరపతయ్య తమ్ముడు జనార్దన్‌ తనకు పరిచయం ఉన్న ఖమ్మం జిల్లా దాచేపల్లికి చెందిన దాచేపల్లి సురేష్‌ సాయంతో చెర్వుమాదారంకు చెందిన రఫీతో గుగులోతు సురేశ్‌ను హత్య చేయడానికి రూ.2.50 లక్షల సుపారీ కుదుర్చుకుని ఫొటోను వివరాలను ఇ చ్చాడు. రఫీకి అడ్వాన్‌గా రూ.34వేలను గూ గుల్‌ పే ద్వారా పంపించాడు. దాచేపల్లి సురేశ్‌  రఫీలు ఇద్దరు కలిసి గుగులోతు సురేశ్‌ ను హత్య చేయడానికి అతడి ఇంటి రెక్కీ నిర్వహించి హత్యకు కావాల్సిన వేటకొడవళ్లను రోడ్డు వెంట భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రఫీ తన గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడైన రాకేశ్‌కు డబ్బు ఆశ చూపి అతడిని కూడా ఒప్పించి, తరువాత తమ వాళ్ల కాదని, తన గ్రామస్తుడైన ఏసోబుకు చెప్పగా అతడు హైదరాబాద్‌లోని పల్లపు నరేందర్‌ గ్యాంగ్‌ ఉందని చెప్పి అతడితో లక్ష రూపాయాలకు ఒప్పందం చేసుకుని రూ.4వేలు ఇచ్చారు.

ఆ తర్వాత నరేందర్‌ గ్యాంగ్‌ ఈ నెల 23న ఏసోబుతో కలిసి హత్య చేసేందుకు రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకుని రఫీకి ఫోన్‌ చేయగా అతడు ఎత్తకపోవడంతో సురేశ్‌ అడ్రస్‌ తెలియపోవడంతో వెళ్లిపోయారు. హత్య ఆలస్యం అవుతుందని జనార్దన్‌ ఒత్తిడి చేస్తుండటంతో 24 రాత్రి ఒంటి గంట సమయంలో  రఫీ, రాకేష్‌ను తీసుకుని ద్విచక్రవాహనంపై రామాపురం క్రాస్‌రోడ్‌లోని గుగులోతు సురేశ్‌ ఇంటికి వెళ్లి సురేశ్‌ తల్లిని మీ కొడుకు లేడా అని కత్తులతో బెదిరించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేవరకు పరారయ్యారు. ఈ క్రమంలో ఒక కత్తి కిందపడిపోయింది. ఈ సంఘటనపై సురేష్‌ తల్లి రాంబాయి ఈ నెల 25న రూరల్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వి చారణ చేపట్టారు. ఎలాగైన అతడిని చంపాలని రఫీ, రాకేశ్‌లు రామాపురం క్రాస్‌ రోడ్డు వద్దకు రాగా పోలీసులు పట్టుకుని వారిని వి చారించి అరెస్ట్‌  చేశారు. వారి వద్దనుంచి రెండు కత్తులు, మూడు సెల్‌ఫోన్‌లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగవంతం చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ వై. సైదులుగౌడ్‌ను, సిబ్బందిని సీఐ అభినందించారు.   
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top