సాక్షి ఎఫెక్ట్‌: సబ్‌ రిజిస్ట్రార్‌ సురేష్‌ ఆచారి సస్పెన్షన్‌ 

Sub Registrar Suresh Acharya Suspended In Anantapur District - Sakshi

అనంతపురం టౌన్‌: ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ సురేష్‌ ఆచారిని సస్పెండ్‌ చేస్తూ డీఐజీ మాధవి శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్‌ రవివర్మ తెలిపారు. సురేష్‌ ఆచారి అనంతపురం రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో  ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న వాటిని సైతం రిజిస్ట్రేషన్‌ చేసిన వైనంపై ‘సాక్షి’ ఈ నెల 1వ తేదీన ‘ప్రభుత్వ భూమిపై పచ్చమూక’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ విచారణ కోసం ఓ కమిటీని నియమించారు.

ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా ఎక్కించారు...? దాన్ని ఎలా రిజిస్టర్‌ చేశారు..? తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశించారు. దీంతో రాప్తాడు తహసీల్దార్‌ ఈరమ్మ రాప్తాడు పొలం సర్వే నంబర్‌ 123–2లోని భూమి వంక పోరంబోకు అని, పైగా నిషేధిత జాబితాలో ఉందని నివేదికను అందజేశారు. మరోవైపు రిజిస్ట్రేషన్‌ శాఖ తరఫున విచారణ చేపట్టిన డీఐజీ మాధవి నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిన సురేష్‌ ఆచారిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సర్వే నంబర్‌ భూములను యాడికి రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ రిజిస్ట్రేషన్‌ చేయగా... ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్‌ రవివర్మ తెలిపారు.

చదవండి:
ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే 
టీడీపీ బడాయి.. బిల్లుల కోసం లడాయి!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top