Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..?

Srinivas Death Mystery In Nalgonda - Sakshi

సాక్షి, రామగిరి (నల్లగొండ): తిప్పర్తి మండలం చిన్నాయిగూడెంలో సోమవారం వెలుగు చూసిన చెదురుపల్లి శ్రీనివాస్‌ (45) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. మండల పరిధిలోని సిలార్‌మియగూడేని చెందిన శ్రీనివాస్‌ వివాద రహితుడని, అతడికి శత్రువులు ఎవరూ లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే, ఘటనాస్థలిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు లేకపోవడం, ఎవరో మట్టుబెట్టినట్లుగానే అక్కడి పరిస్థితులు కనిస్తుండడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కలిసిరాని వ్యాపారం.. 
నామ మాత్రంగా చదువుకున్న శ్రీనివాస్‌ 2007లో మిర్యాలగూడ పట్టణంలోని కేఆర్‌ ఎస్టేట్‌లో దుస్తుల దుకాణం నెలకొల్పాడు. ఎనిమిదేళ్ల పాటు నిర్వహించిన వ్యాపారం శ్రీనివాస్‌ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. అప్పట్లోనే శ్రీనివాస్‌కు రూ. 20లక్షల పైచిలుకు అప్పులు ఉండడంతో ఒత్తిడికి తట్టుకోలేక ఐపీ పెట్టినట్లు తెలిసింది. అక్కడినుంచి మకాం జిల్లా కేంద్రానికి మార్చి స్థానిక హుందాయ్‌ షోరూంలో నాలుగేళ్ల పాటు సూపర్‌ వైజర్‌గా పనిచేశాడు.

చాలీచాలని వేతనంతో కుటుంబం గడవడం కష్టంగా మారడంతో స్వగ్రామంలో తమకున్న భూమితో పాటు బంధువుల భూమిని తీసుకుని కౌలుకు వ్యవసాయం చేసినా నష్టాలనే చవిచూశా డు. తదనంతరం గడిచిన ఏడాదిగా మేళ్ల దుప్పలపల్లిలోని ఓక్రషర్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.  

వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా..
శ్రీనివాస్‌ ఖాళీ సమయాల్లో స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడని తెలిసింది. ఇదే క్రమంలో ఆదివారం కూడా ఉదయం భోజనం చేసిన తర్వాత వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. సాయంత్రం వరకు శ్రీనివాస్‌తో పాటు అతడి తండ్రి నారుమడి కోసం పొలంలో వడ్లు చల్లారు. సాయంత్రం తర్వాత నల్లగొండకు వెళ్తున్నానని చెప్పి బైక్‌పై బయలుదేరాడు. 

సాయంత్రం ఫోన్‌ చేసిందెవరు..?
శ్రీనివాస్‌ సాయంత్రం 5:30 గంటలకు నల్లగొండకు బైక్‌పై వస్తూ సిలార్‌మియగూడెం స్టేజి వద్ద కొద్దిసేపు ఆగి స్థానికులతో మాట్లాడినట్లు సమాచా రం. ఆ సమయంలో అతడి సెల్‌కు ఎవరో ఫోన్‌ చేయగా శ్రీనివాస్‌ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అలా అతను చాలా సేపు ఫోన్‌లో వాగ్వాదం చేశాడని, అవతలివైపు నుంచి మాట్లాడింది ఎవరనేది ఇప్పుడు గ్రామంలో చర్చ జరుగుతోంది.

అయితే, కొద్ది సేపటి తర్వాత శ్రీనివాస్‌ ఇంటికి ఫోన్‌ చేసి అమ్మ ఫోన్‌ చేస్తే నల్లగొండకు వచ్చాడని చెప్పమని తనను ఆదేశించాడని, ఇంటికి రాకుండానే అలా ఎందుకు చెప్పమన్నాడో తెలియడం లేదని హైమావతి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్‌.. ట్విస్ట్‌ ఏంటంటే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top