ఆ వీడియో ఒరిజినల్‌ కాదు | Sakshi
Sakshi News home page

ఆ వీడియో ఒరిజినల్‌ కాదు

Published Thu, Aug 11 2022 2:46 AM

SP Pakirappa says Kuruva Gorantla Madhav Video was fake - Sakshi

అనంతపురం క్రైం: ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప స్పష్టం చేశారు. ఈ వీడియోకు సంబంధించి బాధితులమంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్‌ హాలులో విలేకరులతో మాట్లాడారు. ఆ వీడియోను మొట్టమొదటగా ‘ఐ టీడీపీ అఫీషియల్‌’ అనే వాట్సాప్‌ గ్రూపులో +447443703968 నంబరు ద్వారా ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున 2.07 గంటలకు పోస్టు చేశారన్నారు.

ఈ నంబర్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) వొడాఫోన్‌కు సంబంధించినదిగా తేలిందని చెప్పారు. ఈ వీడియోను ఆ గ్రూపులో పోస్టు చేసే ముందు ఐదుగురు వ్యక్తులకు షేర్‌ చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. ఆ వీడియో పోస్ట్‌ చేసే కొన్ని క్షణాల ముందు మాత్రమే ‘ఐ టీడీపీ అఫీషియల్‌’ అనే వాట్సాప్‌ గ్రూపులో ఆ నంబర్‌ (+447443703968)ను యాడ్‌ చేశారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తొలిసారిగా వీడియోను పోస్ట్‌ చేసింది ఇంటర్నేషనల్‌ నంబర్‌ నుంచి కావడంతో దానికి సంబంధించిన వ్యక్తి వివరాలు సేకరించే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ వీడియోకు సంబంధించి ఎస్పీ ఇంకా ఏం చెప్పారంటే..

మార్ఫింగ్, ఎడిటింగ్‌పై అనుమానాలు
► ఈ వీడియోను చాలాసార్లు ఫార్వర్డ్, రీ పోస్టింగ్‌ చేశారు. దీని కారణంగా ఇది ఒరిజినల్‌ అని నిర్ధారించలేకపోతున్నాం. మార్ఫింగ్‌/ఎడిటింగ్‌ జరిగి ఉండొచ్చు. కొన్ని వీడియోల్లో ఒకవైపు ఎంపీ ఫొటో ఉంచి మరోవైపు సందేశాలు నమోదు చేశారు. మరో వీడియోలో ఎంపీ ఫొటో, మరో వీడియోను పార్లల్‌గా నమోదు చేశారు. ఇవన్నీ ఎడిటింగ్‌/మార్ఫింగ్‌ కిందకే వస్తాయి. స్క్రీన్‌ టెక్నాలజీ యాప్స్‌ ద్వారా వీడియో కాల్‌ను రికార్డు చేయొచ్చు. అసలు బాధితుల మంటూ ఎవరూ ముందుకు రాలేదు. బాధితులెవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంతటి వారినైనా విచారిస్తాం. అందువల్ల ఎంపీ, బాధితుల స్టేట్‌మెంట్‌ను నమోదు చేయలేదు.
► ప్రస్తుతం సాంకేతిక దర్యాప్తు చేపట్టాం. తదుపరి దర్యాప్తులో భాగంగా వీడియో పోస్టు చేసిన వ్యక్తి వివరాల కోసం వొడాఫోన్‌ ప్రొవైడర్‌కు లేఖ రాశాం.
► గుర్తు తెలియని వ్యక్తులు సోషల్‌ మీడియాలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రతిష్టకు భంగం కలిగించారని ఈ నెల 4వ తేదీన ఎంపీ అభిమాని కొనతాలపల్లి వెంకటేశ్వర రావు అనంతపురం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 185/2022 సెక్షన్‌ 67 ఏ, 66 ఈ ఆఫ్‌ ఐటీ యాక్ట్, సెక్షన్‌ 292, 509 ఆఫ్‌ ఐపీసీ కింద అదే రోజు ఆ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 
► ఒక వ్యక్తి రికార్డు చేసిన వీడియోను మరొకరికి పంపించారు. సదరు వ్యక్తి మొబైల్‌లో చూస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ఆ వీడియోను చిత్రీకరించారు. చుట్టుపక్కల ఎవరో మాట్లాడుతున్నట్లు, పశువుల చప్పుడు కూడా అందులో విన్పిస్తోంది. అందువల్ల ఇది ఒరిజినల్‌ వీడియో కాదని తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement