కాల్‌ రికార్డర్‌తో కన్నమేశాడు.. భార్యతో కలిసి తండ్రి ఇంట్లోనే..

Son Robbery In Fathers House Hyderabad - Sakshi

తండ్రి ఇంట్లోనే తనయుడి దొంగతనం   

రూ.25 లక్షల నగదు, నగలు చోరీ 

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో బాధితుడి ఫిర్యాదు 

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆస్తి వివాదాల నేపథ్యంలో తండ్రినే లక్ష్యంగా చేసుకున్నాడో కుమారుడు.. ఆయన లేని సమయం చూసి భార్యతో కలిసి ఇంటికి కన్నం వేశాడు. దీనికోసం ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డర్‌ యాప్‌ను వినియోగించాడు. ఈ విషయం గుర్తించిన తండ్రి సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కుమారుడు చేసిన పనికి బాధితుడు కుమిలిపోతూ పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..  

కరీంనగర్‌ పట్టణానికి చెందిన వైకుంఠం అనే వ్యక్తికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండో అతను కరీంనగర్‌లోనే వేరుగా నివసిస్తున్నాడు. స్థిరాస్తులకు సంబంధించిన వైకుంఠానికి కుమారులతో తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. ఇవి వివాదంగా మారడంతో తండ్రి వద్ద ఉన్న సొత్తును కాజేయాలని రెండో కుమారుడు కుట్ర పన్నాడు. దీనికి అతడి భార్య కూడా సహకరించింది. వైకుంఠం ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? తెలుసుకోవడానికి ఇతగాడు ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌ యాప్‌ను వాడాడు.  

వైకుంఠానికి తెలియకుండా, అనుమతి లేకుండా అదను చూసుకుని ఫోన్‌లో దీన్ని ఇన్‌స్టల్‌ చేశాడు. రికార్డు అయిన ప్రతి కాల్‌ తన ఈ– మెయిల్‌ రూపంలో తన మెయిల్‌ ఐడీకి చేరేలా సింక్‌ చేశాడు. ఇలా తన ఈ– మెయిల్‌ ఐడీకి వస్తున్న ప్రతి కాల్‌ను రెండో కుమారుడు వినేవాడు. వైకుంఠం ఇటీవల హైదరాబాద్‌లోని కుమారుల వద్దకు రావాలని భావించారు. ఈ విషయం వారికి ఫోన్‌లో చెప్పగా... వాళ్లు ఇంటికి తాళాలు పక్కగా వేయాలని, వాటిని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.  
వైకుంఠం ఆ తాళాలను ఫలానా రహస్య ప్రాంతంలో దాచి వస్తానంటూ బదులిచ్చాడు. ఈ సంభాషణ మొత్తం ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డర్‌ యాప్‌ ద్వారా రికార్డు కావడంతో పాటు రెండో కుమారుడి మెయిల్‌కు చేరింది. అలా విషయం తెలుసుకున్న అతగాడు భార్యతో కలిసి తండ్రి ఇంటికి వెళ్లాడు. రహస్య ప్రాంతం నుంచి తాళాలు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు.  

బీరువా తెరిచి అందులోని రూ.25 లక్షల విలువైన నగదు, నగలు కాజేశారు. ఆపై యథావిధిగా తాళాలు వేసి ఆ రహస్య ప్రాంతంలోనే పెట్టేశారు. భార్యతో కలిసి హైదరాబాద్‌ వచ్చిన వైకుంఠం కొన్ని రోజులకు కరీంనగర్‌కు తిరిగి వెళ్లారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా.. బీరువాలో ఉండాల్సిన డబ్బు, బంగారంతో పాటు ఆస్తి పత్రాలు ఆయనకు కనిపించలేదు.  

ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న కుమారులకు చెప్పిన ఆయన అసలు ఏం జరిగి ఉంటుందో ఆలోచించారు. తన ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను నిశితంగా గమనించిన వైకుంఠం.. ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌ యాప్‌ ఉండటాన్ని గుర్తించారు. దాన్ని తెరిచి అధ్యయనం చేయగా.. రెండో కుమారుడి ఈ– మెయిల్‌ ఐడీతో సింకై ఉన్నట్లు తెలుసుకున్నారు. తన సంభాషణలు విన్న అతగాడు ఈ పని చేసినట్లు నిర్ధారించుకుని సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top